సంగీత దర్శకుడు సత్యానికి పాటలు పాడనన్న బాలు..!
ఎస్పీ బాలు భువి నుంచి దివికేగి అయిదేళ్ళు అయింది అంటే ఎవరూ నమ్మలేరు. ఆయన జీవించే ఉన్నారు అనుకుంటారు.;
ఎస్పీ బాలు భువి నుంచి దివికేగి అయిదేళ్ళు అయింది అంటే ఎవరూ నమ్మలేరు. ఆయన జీవించే ఉన్నారు అనుకుంటారు. దానికి కారణం ఆయన పాటలు ప్రతీ రోజూ చెవులలో మారు మోగుతూండడమే. బాలు 74 ఏళ్ళ వయసులో 2020 సెప్టెంబర్ 25న ఈ లోకాన్ని వీడిపోయారు. కరోనా మహమ్మారి ఆయనను అందరికీ దూరం చేసింది. అయితే బాలు ఇంటర్వ్యూలు కానీ ఆయన మాటలు కానీ యూట్యూబ్ లో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాయి. అలా ఆయన గతంలో ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పారు. అవి ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. అందులో ఆయన తన సినీ జీవితంలో కొందరితో ఏర్పడిన విభేదాల గురించి కూడా చెప్పుకొచ్చారు.
సత్యంతో గొడవ :
ఇక బాలూ గాయకుడిగా ఒక దశాబ్ద కాలం అప్పటికే పూర్తి చేసుకున్నారు. ఆయన 1970 దశకంలో బిజీ సింగర్ గా మారిపోయారు ఘంటసాల మరణం తరువాత ఒకటి రెండేళ్ళ పాటు మరో గాయకుడి వి రామకృష్ణ ప్రాభవం సాగినా మళ్ళీ బాలు జోరు అందుకున్నారు. ఆయనతోనే పాటలు పాడించే సంగీత దర్శకులు ఎందరో ఉండడం ఆయన కెరీర్ ని గట్టిగా నిలబెట్టింది. అలా బాలు అంటే ఎంతో ఇష్టపడే సినీ సంగీత దర్శకుడు సత్యం ఆయనతో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో పాడించారు. ఏ దివిలో విరిసిన పారిజాతమో అన్న సాంగ్ తొలినాళ్ళలో బాలుకి దొరికిన ఆణిముత్యంగా చెబుతారు. ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉంటుంది. అలాగే గీత మూవీలో పూచే పూలలోన అన్న సాగ్ నీడలేని ఆడది మూవీలో సత్యం కాంపొజిషన్ లో తొలి వలపే తీయనిది విషాద గీతం ఇలా బాలూకి సత్యానికి బంపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.
నటుడు చలం ఇంట్లోనే :
ఇదే వరసలో మరో సూపర్ హిట్ సాంగ్ ని బాలు సత్యం మ్యూజిక్ డైరెక్షన్ లో పాడారు. చలం హీరోగా వచ్చిన తోట రాముడు మూవీలోని ఓ బంగరు రంగుల చిలకా పాటని పాడిన తరువాత ఆ రోజు రాత్రి చలం ఇంట్లో అంతా కలిసి చిన్నపాటి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలు మీద సత్యం అనుచిత వ్యాఖ్యలు చేసి ఆగ్రహావేశంతో ఊగిపోయారు. బాలు ఎంత నచ్చచెప్పినా వినకుండా సత్యం తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో బాలు తీవ్ర మనస్థాపానికి గురి అయి అక్కడ నుంచి వచ్చేశారు.
ఆయనకు పాడనంతే :
ఇక తాను సత్యానికి పాడేది లేదని తన అసిస్టెంట్ విఠల్ కి బాలు చెప్పేశారుట. ఆ విషయం ఆయనకు చెప్పమన్నారుట. ఆ మరుసటి రోజు పాటల రికార్డింగ్ కోసం సత్యం ఫోన్ చేస్తే ఇదే విషయం విఠల్ ఆయనకు చెప్పారుట. అయినా సరే పదే పదే బాలు ఇంటికి సత్యం ఫోన్ చేస్తూనే ఉన్నారు. చివరికి బాలు ఫోన్ ఎత్తితే ఎందుకు పాటలు పాడవని నేరుగా సత్యం అడిగారు. ముందు రోజు మీ ప్రవర్తన బాగా లేదు, అనుచిత వ్యాఖ్యలు చేశారు అని బాలు ఆగ్రహంతో చెప్పడంతో ఇద్దరి మధ్యన కొంత సేపు వివాదం సాగినా చివరికి సత్యం అనునయంగా జరిగింది జరిగిపోయింది బాలు నీవు పాడకపోతే నా పాట ఏమి కావాలని అడిగేసరికి బాలు కరిగిపోయారుట. అంతే ఆ వెంటనే స్టూడియోకి వెళ్ళి సత్యం మ్యూజిక్ డైరెక్షన్ లో పాట చకచకా పాడేశారు. ఇంతకీ ఆ పాట ఏంటి అంటే ఎన్టీఆర్ హీరోగా నటించిన పౌరాణిక చిత్రం మాయా మశ్చీంద్ర. ఈ మూవీలో ప్రణయ రాగ వాహిని అంటూ సాగే డ్యూయెట్ ని గాయని సుశీలతో కలసి బాలు పాడారు. ఈ సాంగ్ ఒక మెలోడీ సాంగ్ గా ఈ రోజుకీ నిలిచిపోయింది. ఆ తరువాత సత్యం మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో వందల పాటలు బాలు పాడిన సంగతి తెలిసిందే.