బాహుబలి 2 (X) దురంధర్ 2: తొమ్మిదేళ్లలో మార్కెట్ స్పీడ్ ఎలా పెరిగిందంటే?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వసూళ్ల ప్రభంజనానికి సరికొత్త అర్థం చెప్పిన చిత్రం `బాహుబలి 2`. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1788 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ వసూళ్లను సాధించి అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.;
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వసూళ్ల ప్రభంజనానికి సరికొత్త అర్థం చెప్పిన చిత్రం `బాహుబలి 2`. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1788 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ వసూళ్లను సాధించి అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత 2026లో విడుదలైన ఆదిత్య ధర్ దర్శకత్వంలోని `దురంధర్ 2: ది రివెంజ్` ఆ రికార్డులను సవాల్ చేస్తూ దూసుకుపోతోంది. బాహుబలి తన మొత్తం ప్రదర్శన కాలంలో సాధించిన ఆ 1788 కోట్ల మైలురాయిని.. దురంధర్ 2 కేవలం 46 రోజుల్లోనే అధిగమించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
శాక్ నిల్క్ లెక్కల ప్రకారం.. బాహుబలి 2 విడుదలైన 46 రోజుల్లో సుమారు 1710 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే సమయంలో రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ డ్రామా`దురంధర్ 2` ఏకంగా 1788 కోట్ల మార్కును దాటేసి 1790 కోట్ల దిశగా పరుగు తీస్తోంది. నిజానికి అప్పటి బాహుబలి స్పీడ్ ను ఇప్పడి దురంధర్ స్పీడ్ తో పోల్చితే రెండు చిత్రాలూ ఇంచుమించు ఒకే వేగంతో వసూళ్లను సాధించాయని చెప్పాలి. అయితే బాహుబలి సాధించిన విజయం ఒక విప్లవం లాంటిది. ఎందుకంటే ఆ సినిమా బాషా భేదం లేకుండా సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మొదటిసారిగా నిరూపించింది.
గడిచిన తొమ్మిదేళ్లలో కాలమాన పరిస్థితులు.. ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. బాహుబలి 2 విడుదలైన సమయంలో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం ఇంతగా లేదు. కానీ నేడు ఒక సినిమా థియేటర్లలో ఉండగానే డిజిటల్ వినోదం గట్టి పోటీనిస్తోంది. బాహుబలి సమయంల ఐపిఎల్ ప్రభావం ఉంది కానీ ఓటీటీ ప్రభావం తక్కువ. బుల్లితెరపై ఐపీఎల్, బిగ్ బాస్ వంటి వినోద కార్యక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఓటీటీ పోటీ ఉన్నా.. దురంధర్ 2 వంటి సినిమాలకు ప్రేక్షకులు క్యూ కట్టడం గమనార్హం. మంచి కంటెంట్ ఉంటే ఇప్పటికీ ప్రజలు థియేటర్లకు తరలివస్తారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
దురంధర్ 2 సాధించిన ఈ ఘనతలో విదేశీ మార్కెట్ వాటా కూడా కీలకమైంది. ఈ చిత్రం భారతదేశంలో 1362 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. అంతర్జాతీయంగా 426 కోట్లను కొల్లగొట్టింది. ఆమిర్ ఖాన్ `దంగల్` తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. ఒక స్పై యాక్షన్ చిత్రం.. అది కూడా రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి పీరియడ్ డ్రామా రికార్డులను అధిగమించడం విశేషం.
బాహుబలి 2 -దురంధర్ 2 చిత్రాల మధ్య జరిగిన ఈ బాక్సాఫీస్ పోరు భారతీయ సినిమా మార్కెట్ ఎంతలా విస్తరించిందో తెలియజేస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం బాహుబలి వేసిన పునాదిపైనే నేడు దురంధర్ 2 వంటి భారీ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో మేకింగ్ ప్రమాణాలను ప్రదర్శిస్తున్నాయి. వసూళ్ల వేగంలో ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న ఆ స్వల్ప తేడా... మారుతున్న సాంకేతికత ... పెరుగుతున్న సినిమా మార్కెట్ పరిధిని ప్రతిబింబిస్తోంది. దురంధర్ 2 చిత్రానికి ఆదిత్యా ధర్ దర్శకత్వం వహించగా, జియో స్టూడియోస్ - బి62 స్టూడియోస్ నిర్మించాయి. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించాడు.