ఏపీలో రాష్ట్రపతి పాలన...అయ్యే పనేనా ?
| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింస, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, ఎన్నికల ఘర్షణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, బాధితుల వివరాలను గవర్నర్‌కు అందజేశారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన వైసీపీ సీనియర్ నాయకుల బృందం కోరింది. స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ల దగ్గర నుండి పోలింగ్ వరకు అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందన నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆ పార్టీ అంటోంది. అలాగే అన్ని చోట్లా దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలపై ఫిర్యాదులు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పైగా అధికార పార్టీకి అండగా నిలుస్తూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలు ఇతర అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరుతోంది. ఇక వైసీపీ నేతల మీద జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాధితుల వివరాలతో కూడిన ఆధారాలను వైసీపీ గవర్నర్‌కు అందచేసింది.
డిమాండ్ ఓకే కానీ :
విపక్షాలలో ఉన్న పార్టీలు అయితే ఎన్ని అయినా డిమాండ్లు చేయవచ్చు. కానీ అవి అమలు అవుతాయా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా చూస్తే రెండు పార్టీల వ్యవస్థ ఉన్న చోట్ల లేదా బహుముఖ రాజకీయం ఉన్న చోట్ల ఈ తరహా డిమాండ్లు వస్తూనే ఉంటాయి. ఒక పార్టీ అయిదేళ్ల పాలనలో విపక్షాలు ఈ డిమాండ్లు చేయకపోతేనే విశేషంగా చెప్పుకునే కాలం ఇది. ఎందుకంటే వర్తమానంలో రాజకీయ ధోరణులు ఎలా ఉన్నాయో అంతా చూస్తున్న విషయమే అని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లలో సహేతుకత కూడా ఇక్కడా చూడాల్సి ఉంటుంది. ఇక విపక్షాలు కోరినా రాష్ట్రపతిపాలన పెట్టే అవకాశాలు లేని పరిస్థితులు చాలా వరకూ ఉంటాయి. అదే సమయంలో రాజ్యాంగపరమైన అంశాలతో పాటు న్యాయపరమైన అంశాలను చూడాల్సి ఉంటుంది.
సాధారణంగానేనా :
ఇక దేశంలో అనేక రాష్ట్రాలలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఈ తరహా ఆరోపణలు వస్తూనే ఉంటున్నాయి. గతానికి ఇప్పటికీ రాజకీయంగా వచ్చిన మార్పుగానే దీనిని చూస్తున్నారు. అధికారంలో ఉన్నవారికి సహజంగానే కొంత ఎడ్జ్ ఉంటుంది. దానికి మరింతగా వారు వెసులుబాటుగా వాడుకుంటున్నారు అని అంటున్నారు. అయితే అందరూ ఆ తానులో ముక్కలే అని ఎవరు అధికారంలో ఉంటే వారు ఇలాగే చేస్తున్నారు అన్నది కూడా జనాంతికంగా ఉన్న భావన గా చెబుతున్నారు. అందువల్ల ఈ డిమాండ్లు చేయడం విపక్షాలకు సాధారణమైన వ్యవహారంగానే చూస్తున్న నేపథ్యం కనిపిస్తోంది.
రాజకీయంగా చూస్తే :
ఇక రాజకీయంగా చూస్తే కనుక కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఉంది. ఏపీలో కూడా అదే ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఇలా రెండు చోట్లా ఒకే ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో రాష్ట్రపతి పాలన అంటే కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా రాజకీయాల పట్ల ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే అని అంటున్నారు. పైగా ఎన్నికలు వాటిలో జరిగే ఘర్షణలు ఇవన్నీ కూడా అన్ని చోట్లా ఉన్నవే అన్న జనరల్ ఒపీనియన్ కూడా ఉంటుంది. అయినా సరే తెలిసి మరీ వైసీపీ ఈ డిమాండ్ ఎందుకు చేస్తోంది అంటే ఇక్కడ కూడా రాజకీయ కోణాన్నే అంతా చూస్తున్నారు.
కార్నర్ చేయాలనే :
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడానికే రాష్ట్రపతి పాలన డిమాండ్ ని వైసీపీ ఎత్తుకుంది అని అంటున్నారు. దీని ద్వారా ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని జనాలకు బలంగా చెప్పాలన్న వ్యూహం కూడా ఉంది. అయితే ఏపీ జనాలే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలు అంటే ఇలాగే జరుగుతుందని జనాలు కూడా డిసైడ్ అయిపోయిన నేపథ్యం కూడా ఉంది. మొత్తానికి ఎందుకీ డిమాండ్ అంటే పవర్ ఫుల్ గా ఉంటుందనే అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆ పార్టీకి ప్రాణ వాయువు లాంటి ఎంపీల మద్దతు ఏపీ నుంచి అందుతోంది. మరి అలాంటపుడు ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారు అని అనుకుంటే లాజిక్ కి అందని అంశంగానే చూడాలని అంటున్నారు.