వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం
| సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. దివంగత వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలున్న గిరిబాబు, జగన్ వైసీపీ స్థాపించిన తొలినాళ్లలో పార్టీకి మద్దతుగా నిలిచారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎలాంటి పదవులూ ఆశించకుండా తనదైన శైలిలో రాజకీయ ప్రయాణం సాగించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై రాజకీయ రంగ ప్రముఖులు పలువురు తమ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గిరిబాబు మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగానికి చేసిన సేవలను తలంచుకున్నారు. ఇక గిరిబాబు విషయానికి వస్తే ఆయన నటుడు మాత్రమే కాదు రాజకీయాల పట్ల ఆసక్తి అవగాహన ఉన్నవారు. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు ఆయన తనదైన దారిలో ప్రయాణించారు. వివిధ పార్టీలలో అగ్ర నాయకులతో స్నేహ బంధం కొనసాగించారు కానీ పదవులు ఎప్పుడూ కోరుకోలేదు. అదే ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
వైఎస్సార్ తో స్నేహం :
ఇదిలా ఉంటే గిరిబాబు సినీ రంగంలో ఉంటూ రాజకీయాల పట్ల మక్కువ కనబరిచేవారు. వర్తమాన రాజకీయ అంశాల మీద ఆయనకు ఎంతో అవగాహన ఉండేది. ఈ నేపధ్యంలో గిరిబాబు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలను నెరిపే వారు అని చెబుతారు. ఆ స్నేహబంధం కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి వైఎస్సార్‌తో గిరిబాబుకు ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తుచేసుకున్నారు. అంతే కాదు గిరిబాబు వైసీపీలో కూడా క్రియాశీల సభ్యుడిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయన లేని లోటు తీరనిది అని జగన్ అన్నారు.
వైసీపీ తొలినాళ్ళలో :
ఇక వైఎస్సార్ మరణానంతరం జగన్ కి తొలి నాళ్ళలో గిరిబాబు నైతికంగా మద్దతు ఇచ్చిన సందర్భాలను కూడా ఉదహరిస్తారు. వైసీపీని జగన్ స్థాపించినప్పుడు గిరిబాబు క్రియాశీలక సభ్యుడిగా పనిచేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు సహకారం అందించారు. అంతే కాకుండా పలు ఎన్నికల సందర్భంలో ఆయన పార్టీ తరఫున తన అభిప్రాయాలను కూడా చెప్పేవారు. అయితే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండేవారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడు ఇష్టపడలేదు అని చెబుతారు. పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలు నాయకుల పట్ల ఉన్న అభిమానంతోనే ఆయన రాజకీయాల్లో కొనసాగారని అంటారు.
మొదటి నుంచి కూడా :
ఇక సినీ రంగంలో క్రిష్ణ గిరిబాబు మంచి స్నేహితులు అన్నది తెలిసిందే. క్రిష్ణ కాంగ్రెస్ రాజకీయాల పట్ల ఆసక్తిని చూపడమే కాదు, రెండుసార్లు ఎంపీగా ఏలూరు నుంచి పోటీ చేశారు. అందులో ఒకసారి గెలిచారు. ఇక రాజీవ్ గాంధీ పిలుపు మేరకు క్రిష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయనతో పాటు గిరిబాబు కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల తన అభిమానం చూపించేవారు అని అంటారు. ఇక అప్పట్లో అంటే 80 దశకంలో సూపర్ స్టార్ క్రిష్ణతో కలిసి రాజకీయ అంశాలతో కూడుకున్న సినిమాల్లో నటించారు. అందులో గిరిబాబు ముఖ్య పాత్రలను పోషించారు. అప్పటి రాజకీయ వాతావరణానికి తగినట్లుగా ఆ సమయంలో రాజకీయాల్లో కీలకంగా అధికారంలో ఉన్న వారిని పోలిన పాత్రలను కూడా గిరిబాబు పోషించి జనాల మన్ననలు అందుకున్నారు. అలా గిరిబాబులో రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది.
తొలి తరం నటులలో:
కేవలం గిరిబాబు అనే కాదు ఆయనకు ముందు ఉన్న తొలి తరం నటులలో అధిక భాగం కాంగ్రెస్ తోనే ప్రయాణించారు. జగ్గయ్య వంటి వారు ఏకంగా ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున గెలిచారు. అలాగే ఆనాటి అగ్ర నటులు అంతా కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులు గా ఉండేవారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టాక సినీ రంగంలో కూడా ఆ తేడా కనిపించింది. నటులుగా అంతా కలిసి ఉన్నా రాజకీయపరంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉండేవి. అయితే ఇదంతా కూడా ఎంతో సానుకూల వాతావరణంలోనే సాగిపోయేది అని నాటి పరిస్థితులను అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే గిరిబాబు సహ నటులు అయిన మోహన్ బాబు మురళీమోహన్ ఎంపీలుగా కూడా చేశారు. గిరిబాబు మాత్రం ఏ పదవినీ కోరుకోలేదు అన్నది కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అయితే ఆయనలో రాజకీయ అవగాహన లోతైన విశ్లేషణ ఎక్కువని చెబుతారు.