కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !
| రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, కాంగ్రెస్‌తో వైసీపీ పొత్తు ప్రచారంపై కూడా జగన్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీలో ఎన్డీయే పాలన సాగుతోంది. టీడీపీ బీజేపీల బంధం అత్యంత పటిష్టంగా ఉంది. పైగా ఇది 2029 ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని కూటమి పార్టీలు అన్నీ బల్ల గుద్దీ మరీ చెబుతున్నాయి. ఇక దేశంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉంది. ఈ కూటమికి పెద్దన్నగా కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. మరో వైపు చూస్తే ఏపీలో కాంగ్రెస్ అన్నది నామమాత్రంగా ఉంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో టీడీపీ స్నేహం చేస్తుందని అనుకోవడమే రాజకీయ వింతా విడ్డూరం. అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఎపుడూ ఏదీ అసాధ్యం అన్నది కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సందర్భం ఏంటి అంటే :
ఇంతకీ జగన్ ఎందుకు అలా అన్నారు అంటే ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం గురించి అతి పెద్ద ట్వీట్ ని తాజాగా చేశారు. అందులో అనేక విషయాలను ప్రస్తావిస్తూనే పొరుగున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఈ లిఫ్ట్ స్కీం మీద రాజకీయ రచ్చ సాగుతోందని దీని వల్ల అసలు విషయాలు పక్కకు పోతున్నాయని జగన్ అంటున్నారు. అయితే అసలు వాస్తవాలు చెప్పి స్పష్టత ఇవ్వాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు అయితే తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నారని జగన్ మండిపడ్డారు. దాంతో రాయలసీమ లిఫ్ట్ స్కీం సంగతి అలా ఉంచితే బాబు కాంగ్రెస్ దోస్తీ అంటూ జగన్ చేసిన ఈ కొత్త వ్యాఖ్యలు రాజకీయంగా మంట పుట్టించేలానే ఉన్నాయని అంటున్నారు.
రాయలసీమకు ప్రాణంగా :
ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఆ మిగులు పనులు పూర్తి చేయాల్సిన టీడీపీ కూటమి తనకు పేరు వస్తుందోనని ఆపేశారని జగన్ విమర్శించారు. ఇప్పటికైనా పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, పక్క రాష్ట్రం వారు ఎవరైనా అభ్యంతరం చెప్తే దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సింది పోయి కాంగ్రెస్ తో హాట్‌లైన్ రాజకీయాల కోసం బాబు దానిని బలిపెట్టారు అని జగన్ విమర్శించారు. రాయలసీమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరవు లాంటి విపత్కర పరిస్థితులలో ఒక హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ రాయలసీమ ప్రజల ప్రాణాధారమని చెబుతూ దానిని అలా వదిలేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం చెప్పదలచుకున్నారు :
సరే రాయలసీమ ప్రాజెక్ట్ గురించి కాస్తా పక్కన పెడితే కాంగ్రెస్ తో దోస్తీ హాట్ లైన్ పాలిటిక్స్ అంటూ బాబు మీద జగన్ చేసిన కామెంట్స్ ఇపుడు చర్చకు వస్తున్నాయి. బీజేపీతో ఎన్డీయేతో ఉన్న బాబు కాంగ్రెస్ తో దోస్తీ ఎలా చేయగలరు అన్నది ఇక్కడ ప్రశ్న. దీనిని కేవలం బాబు రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటూ జగన్ కామెంట్స్ చేశారా లేక ఇంకా ఏమైనా ఉందా అన్నదే అంతా తరచి చూస్తున్నారు. అయితే టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఏమీ కొత్త కాదు, 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ తరువాత మళ్లీ బీజేపీతో టీడీపీ కలసింది. ఇవన్నీ టీడీపీ రాజకీయ ఎత్తుగడలూ వ్యూహాలు అని అనుకున్నా జగన్ ఇపుడు ఈ దోస్తీ గురించి మాట్లాడడం అంటే ఏం చెప్పదలచుకున్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.
జగన్ దూరమేనా :
ఇక కాంగ్రెస్ టీడీపీ హాట్ లైన్ పాలిటిక్స్ అని జగన్ అనడం ఇదే తొలిసారి కాదు, ఒకసారి ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. ఇపుడు చూస్తే మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్తుందన్నది ఆ ప్రచార సారాంశం. మరి టీడీపీ దోస్తీ అని చెప్పడం ద్వారా జగన్ తాము దూరంగానే కాంగ్రెస్ కి ఉంటుందని స్పష్టం చేశారా అన్నది కూడా చర్చగా ఉంది. అదే కనుక జరిగితే ప్రస్తుతం వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలే అనుకోవాలి. ఇక ఏపీలో పీసీసీ చీఫ్ గా సొంత సోదరి ఉన్నా ఆమె వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. అలాగే దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెబుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయం మాట్లాడడం లేదని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు నేషనల్ మీడియాలో హైలెట్ అయినా కూడా మాట్లాడలేదని కూడా వైసీపీ నుంచి విమర్శలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే బాబు కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారో లేదో తెలియదు కానీ తాను మాత్రం ఎప్పటికీ దూరమే అని జగన్ స్పష్టం చేశారు అని అంటున్నారు.