కూటమికి తిప్పలు: అటెండర్‌ను చెప్పుతో కొట్టిన సీఐ
అయితే.. ఇక్కడ కూడా లంచాల వ్యవహారమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు.;
ఏపీలో లంచాల వ్యవహారం రోడ్డున పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా తీసుకునే లంచాల వ్యవహారం.. ఇప్పుడు కార్యాలయాలు, రోడ్లు కూడా ఎక్కేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మార్వో వర్సెస్ ఎమ్మె ల్యే మధ్య లంచాల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ ఘట్టం గురించి మరిచిపోకముందే.. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏకంగా ఓ మహిళా సర్కిల్ ఇన్ స్పెక్టర్.. తన అటెండర్‌ను చెప్పుతో కొట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది.
అయితే.. ఇక్కడ కూడా లంచాల వ్యవహారమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. కల్యాణదుర్గం ఎక్స్ జ్ పోలీసు స్టేషన్ పరిధిలో నాటు సారా విక్రయాలు.. మద్యం సిండికేట్లు ఎక్కువగా నడుస్తున్నాయ న్నా ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎక్సైజ్ అధికారులను కూడా మార్చారు. ఈ క్రమంలో నే హసీనా బాను అనే మహిళా అధికారిని కల్యాణదుర్గం ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో సీఐగా నియమించారు. అయితే.. పాత పద్ధతులు మాత్రం మారడం లేదు.
అటెండర్ ద్వారా లంచాలు తీసుకుంటున్నారని.. సోషల్ మీడియాలో స్థానికంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే పీఎ ఒకరు నేరుగా సీఐని ప్రశ్నించారు. అయితే.. తనకు సంబంధం లేదని సీఐ బాను పేర్కొన్నారు. కానీ, ఆమె ఆఫీసు అటెండరు వేల రూపాయలను లంచగా తీసుకున్నాడంటూ కొన్ని ఆధారాలను చూపించారు. దీంతో అక్కడికక్కడే ఆమె అటెండర్‌ను ప్రశ్నించారు. దీనికి అతను.. ``మీరు తీసుకోమంటేనే తీసుకున్నా. మీరు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇచ్చా`` అని పేర్కొన్నాడు.
అంతేకాదు.. `ఎక్కవ మాట్లాడితే అసలు విషయాలు చెప్పేస్తా`` అని అటెండర్ హెచ్చరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా సీఐ.. టీడీపీనాయకుడి సమక్షంలోనే అటెండర్‌పై చెప్పుతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. అటెండరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తో సీఐ పై అట్రాసిటీ కేసు పెట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం డీజీపీ కార్యాలయానికి చేరింది. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా సీఎం చంద్రబాబు పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, నాయకులు మాత్రం కట్టుబాటు తప్పుతున్నారన్న చర్చ సాగుతోంది.