భయపెడతా.. చూడు! వైసీపీలో మరో నేత హెచ్చరికలు

‘అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి.;

Update: 2025-10-19 06:41 GMT

‘ఇంకా రెండేళ్లు అధికారంలో ఉంటారు.. మూడో దీపావళిని వారు చూస్తారో లేదో చూసుకోవాలి’ జగన్ 2.0లో నేనేంటో చూస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వైసీపీ అధికారంలో ఉండగా ‘గుడ్ మార్నింగ్ ధర్నవరం’ అంటూ ప్రతిరోజూ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన కేతిరెడ్డి.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే భయమేంటో చూపిస్తానంటూ హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి 3.0 చూపిస్తా. ఎమ్మెల్యేగా గెలిచేది కూడా అందుకే’ అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే ప్రతీకారం మాత్రమే ఉంటుందని ఆయన చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ధర్మవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైసీపీలో సంస్థాగత పదవులను కేటాయించారు. ఇలా పార్టీ పదవులను తీసుకున్న వారిని శనివారం ఓ కల్యాణమండపంలో కేతిరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్ ను ఉత్సాహపరిచేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రతీకారేచ్ఛతో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మంచితో వచ్చే భక్తి కంటే భయంతో వచ్చే భక్తి ఎక్కువ కాలం ఉంటుందని దాన్ని తాను చేసి చూపిస్తానంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండేళ్లలో వారు ఏం మాట్లాడినా భరిస్తా, వచ్చే మూడో దీపావళిని వారు చేసుకుంటారో లేదో చూసుకోవాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా, కబ్జాలు చేసేందుకు గుడ్ మార్నింగ్ పేరిట తిరిగానని విమర్శలు చేసిన వారు.. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా నిరూపించలేకపోయారని ఆరోపించారు.

మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో కానీ, ఇప్పటి నుంచే తాము ప్రతీకారం తీర్చుకుంటామని వైసీపీ నేతలు వార్నింగులు ఇవ్వడం విమర్శలకు కారణమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 2.0 పాలన చూస్తారని, అందరికీ సినిమా చూపిస్తానని వార్నింగులిస్తున్నారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు అదే తరహా హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లవా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనివల్ల ఆ పార్టీకి మైలేజ్ ఏ విధంగా పెరుగుతుందని భావిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా కేతిరెడ్డి వంటి వారు సైతం 3.0.. 4.0 వంటి వార్నింగులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News