పెళ్లి వేడుకకు రాప్తాడుకు వచ్చిన జగన్ కోసం ఇంత జనసందోహమా?

అభిమానం ఉప్పొంగింది. అభిమాన నేతను చూసేందుకు ప్రజలు ప్రవాహం మాదిరి కదిలి వచ్చిన సందర్భమిది.;

Update: 2025-11-24 04:26 GMT

అభిమానం ఉప్పొంగింది. అభిమాన నేతను చూసేందుకు ప్రజలు ప్రవాహం మాదిరి కదిలి వచ్చిన సందర్భమిది. పెళ్లి వేడుక కోసం వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు.. ఆయన్ను కలిసేందుకు.. సెల్ఫీ దిగేందుకు పోటీ పడిన తీరు చూస్తే.. జగన్ కోసం తపించే జనం ఎంత భారీగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇదంతా అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.

వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ మోక్షితా విష్ణుప్రియారెడ్డికి.. డాక్టర్ తేజేష్ రెడ్డి పెళ్లి వేడుక ఆదివారం రాప్తాడు సమీపంలో జరిగింది. ఈ వేడుక కోసం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లుగా తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ ఎత్తున పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి రావటం గమనార్హం. అంతేకాదు.. బెంగళూరు నుంచి హెలిప్యాడ్ కు వచ్చిన జగన్ కు స్వాగతం పలికిన అభిమానులు.. ఆయన కారుతో కలిసి ప్రయాణించేందుకు పోటీ పడ్డారు.

దీంతో జాతీయ రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డుల్ని ప్రదర్శిస్తూ తమ అభిమాన నేతకు జైజేలు పలుకుతూ పెళ్లి వేడుక జరిగే వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీ ఎత్తున అభిమానులు ఉండటంతో.. మొత్తంగా పెళ్లి వేడుక జరిగిన ప్రాంతం మొత్తం జగన్ అభిమానులతో నిండిపోయింది. జగన్ కనిపించేలా సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు పోటీ పడ్డారు.

తనను అభిమానించే అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. వారి అభిమానానికి చిరునవ్వులతో ప్రతిస్పందిస్తూ వివాహ వేడుకకు హాజరైన జగన్.. నూతన వధూవరులిద్దరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశీస్సులు అందజేశారు. అనంతరం తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. ఆయన సోదరుడి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన జగన్ అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. మొత్తంగా పెళ్లి వేడుకకు వచ్చిన జగన్ కోసం ఇంత భారీగా జనం తరలిరావటం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News