ఏఎస్పీ.. నీ అంతుచూస్తా.. రెచ్చిపోయిన జేసీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి జెడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.;

Update: 2025-10-21 11:12 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి జెడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్థానిక అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రిలో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, “ఏఎస్పీ రోహిత్ చౌదరి చదువుకున్నవాడు కానీ బుద్ధి, జ్ఞానం లేని వాడు. పనికిరాడు. రాళ్ల దాడులు జరిగితే ఇంట్లో కూర్చుంటాడు, ఘర్షణలు అయిపోయాక బయటకు వస్తాడు. తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాతే శాంతి వచ్చింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంతటితో ఆగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి, “ఏయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా. నీ దగ్గర తుపాకులు ఉన్నాయా? నా దగ్గర కూడా ఉన్నాయి. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. డీఎస్పీ చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివి. నీ ఇంటి ముందు నిరసన తెలిపినా స్పందించవు. నేను మౌనంగా ఉన్నాను కానీ ఒకవేళ మాట్లాడితే నీ ఇంట్లోకి దూరి చూపిస్తా” అంటూ రెచ్చిపోయారు.

ఇక రెండు రోజుల క్రితం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో వీరంగం సృష్టించిన ఘటన ఇంకా చర్చలోనే ఉంది. వైఎస్సార్‌సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డిపై ఆయన అనుచరులు మధ్యాహ్నం బహిరంగంగా దాడి చేశారు. నాగేశ్వరరెడ్డి టీ తాగుతుండగా, జేసీ వాహనంలో అటుగా వెళ్తూ చూసి, “ఇన్నీ ఎందుకురా ఇంకా వదిలేశారు” అంటూ అనుచరులను రెచ్చగొట్టారట. వెంటనే పది మందికి పైగా జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరెడ్డి ప్రాణాల కోసం పరుగులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇంట్లో తలదాచుకున్నారు. అనంతరం స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఈ ఘటనలతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం హైటెన్షన్‌గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్య వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా సంఘాలు జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాడిపత్రిలో జేసీ – పోలీసు తగాదా ఎటు దారితీస్తుందో చూడాలి,

Tags:    

Similar News