బోగీలో రక్తం మరకలు, రైలులో పాతనేరస్తులు? సీఐ సతీష్ కుమార్ కేసులో ఎన్నో డౌట్స్

పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి, గుంతకల్లు జీఆర్పీ సీఐ సతీష్ కుమార్ మరణంపై మిస్టరీ వీడటం లేదు.;

Update: 2025-11-17 11:46 GMT

పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి, గుంతకల్లు జీఆర్పీ సీఐ సతీష్ కుమార్ మరణంపై మిస్టరీ వీడటం లేదు. తలపై బలమైన గాయాలు ఉండటం, చాతీ భాగంలో ఎముకలు విరిగిపోవడంతో సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఘటన స్థలిలో సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ బరువు ఉన్న బొమ్మలను రైలు నుంచి తోసివేసి డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. దీనిద్వారా సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నా, లేక ప్రమాదవశాత్తూ పడిపోయిన ఏయే భాగాల్లో దెబ్బలు తగిలే అవకాశం ఉంది? ఎంత తీవ్రమైన గాయాలు తగిలే పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇదే సమయంలో కేసులో మిస్టరీని ఛేదించేందుకు 15 బృందాలు అనేక విధాలుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నెల 13న గుంతకల్లులో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కిన సీఐ సతీష్ కుమార్ కేవలం గంట వ్యవధిలోనే మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు రైలులో ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న వారు పలు అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రైలులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారిలో ఎవరైనా పాత నేరస్తులు, అనుమానితులు ఉన్నారా? అనేది ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రైలు బోగీలో ఏమైనా ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయా? ఆ బోగీలో ఎవరెవరు ఉన్నారు? వారు సతీష్ కుమార్ ను చూశారా? అనేది విచారిస్తున్నారని చెబుతున్నారు.

ఇక రైలులో సతీష్ కుమార్ లగేజీ ఆయన రిజర్వు చేసుకున్న సీటు వద్ద కాకుండా, వేరే చోట ఉన్నట్లు తిరుపతిలో రైల్వే పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. అదేవిధంగా ప్రయాణికుల జాబితాను పరిశీలించగా, అందులో దాదాపు 13 మంది పాత నేరస్తులు ప్రయాణించారని, వారు వివిధ బోగీల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ముగ్గురు సతీష్ కుమార్ ప్రయాణించిన ఏసీ కంపార్టుమెంట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.

మిగిలిన వారిలో ఎస్‌-4లో ఒకరు, ఎస్‌-5లో ఇద్దరు, ఎస్‌-6లో ఇద్దరు, ఎస్‌-7లో ఇద్దరు, బీ-1లో ఒకరు, బీ-5లో ఒకరు, బీ-6లో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఎక్కడ ట్రైన్‌ ఎక్కారు? ఎక్కడ దిగారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కేసు చిక్కుముడి వీడాలంటే.. సతీశ్‌ కుమార్‌ గుంతకల్లు నుంచి కోమలి వరకు ప్రయాణించిన ‘గంటే’ కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఆ గంటలో ఏం జరిగిందనేదే తేలాల్సివుంది. ఇప్పటివరకు సరైన ఆధారాలు ఏవీ లభించలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో సతీష్ కుమార్ మరణం వెనుక మిస్టరీని ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News