లార్డ్స్ లో అద్భుతం.. దక్షిణాఫ్రికా ప్రపంచ చాంపియన్ కల నెరవేరింది..

ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం శనివారం లార్డ్స్ లో నాలుగో రోజు 281 పరుగులు టార్గెట్ ను పూర్తిచేసి టెస్టుల్లో చాంపియన్ అయింది.;

Update: 2025-06-14 13:49 GMT

పెద్ద టోర్నీలు గెలవాలంటే ఏ గేమ్ లొనైనా కాస్తంత లక్ కూడా కలిసిరావాలి. కానీ, దక్షిణాఫ్రికాకు ఎప్పుడూ బ్యాడ్ లక్ జేబులోనే ఉంటుంది. ప్రపంచ క్రికెట్ లో పెద్ద జట్టు అయినా.. అత్యద్భుత ఆటగాళ్లు అనదగ్గవారు ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగివచ్చి 35 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ లో ప్రపంచ చాంపియన్ అనిపించుకోలేకపోయింది. కారణం.. ఒత్తిడికి లోనవడం.. లేదంటే ప్రకృతి సహకరించకపోవడం..

 

ఈసారి మాత్రం దక్షిణాఫ్రికాకు అన్నీ కలిసొచ్చాయి. ముఖ్యంగా భారత్ కు ఆ జట్టు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చివరి 8 టెస్టుల్లో ఆరు ఓడిపోయి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు దూరమైంది టీమ్ ఇండియా. చివరి ఏడు టెస్టులు గెలిచి అనూహ్యంగా ఫైనల్ కు వచ్చింది దక్షిణాఫ్రికా.

ఇప్పుడు ప్రఖ్యాత మైదానం.. క్రికెట్ మక్కాగా చెప్పుకొనే లార్డ్స్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి మరీ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ చాంపియన్ అయింది. క్రికెట్ లో ఇప్పటివరకు టి20లు, వన్డేల్లో సఫారీలు ప్రపంచ చాంపియన్ లు (ప్రపంచ కప్ లు గెలవడం) కాలేదు. నిరుడు సరిగ్గా ఇదే రోజుల్లో టి20 ప్రపంచ కప్ ఫైనల్లో గెలిచేలా కనిపించినా.. టీమ్ ఇండియా అద్భుత పోరాటంతో రన్నరప్ గా మిగిలిపోయింది.

ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం శనివారం లార్డ్స్ లో నాలుగో రోజు 281 పరుగులు టార్గెట్ ను పూర్తిచేసి టెస్టుల్లో చాంపియన్ అయింది. ఈ మ్యాచ్ లో మొదట దక్షిణాఫ్రికా వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసినా.. దక్షిణాఫ్రికా 138 పరుగులే చేయగలిగింది. 74 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 207 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, అప్పటికీ 281 పరుగుల టార్గెట్.. అదికూడా ఆస్ట్రేలియా మేటి పేసర్లు స్టార్క్, కమ్మిన్స్, హేజిల్ వుడ్ లను ఎదుర్కొంటూ ఛేదించడం అంటే మామూలు కాదు. కానీ, దక్షిణాఫ్రికా సాధించింది.

ఫైనల్ కు చేరడంలో భారత్ పరోక్ష సాయం మాత్రమే కాదు.. బ్యాడ్ లక్ కు పెద్దన్న అయిన దక్షిణాఫ్రికా ఫైనల్లో టాస్ రూపంలో లక్ వరించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా బౌలింగ్ ఎంచుకోవడం మేలు చేసింది. మూడో ఇన్నింగ్స్ చివరి నుంచి మొదలై.. నాలుగో ఇన్నింగ్స్ కు వచ్చేసరికి లార్డ్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. దీంతో చేజింగ్ కాస్త సులువు అయింది.

ఫైనల్లో పేసర్ రబాడ అద్భుత బౌలింగ్ కూడా దక్షిణాఫ్రికా పైచేయి సాధించేలా చేసింది. ఆస్ట్రేలియా పేసర్లతో పోలిస్తే.. రబాడ తప్ప దక్షిణాఫ్రికా పేసర్లు సాధారణమే. కానీ, ఈ సారి లక్ దక్షిణాఫ్రికా వైపు ఉండడంతో కప్ (గద) అందుకుంది. తొలిసారి ప్రపంచ చాంపియన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది.

Tags:    

Similar News