అమెరికాను వీడారో.. ఉద్యోగాలు పోతాయి.. గూగుల్ హెచ్చరిక
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు తీవ్రంగా ఆలస్యమవుతున్న నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దేశం విడిచి బయటకు వెళ్లవద్దని గూగుల్ సూచించింది.;
తుమ్మితే ఊడిపోయి జాబుల కాలం వచ్చేసింది. అమెరికాలో ట్రంప్ తలతిక్క పనుల వల్ల ఇప్పుడు ఎవరి జాబు ఎప్పుడు ఊడుతుందో తెలియని ఓ కొత్త భయం ప్రవాస భారతీయ ఉద్యోగులను వెంటాడుతోంది. కక్కలేక మింగలేక అక్కడ పనులు చేయలేక.. ఇండికొస్తే తిరిగి వెళతామో లేదో తెలియక నరకం అనుభవిస్తున్నారు. అసలే వీసా అపాయింట్ మెంట్లకు సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలు చేసేవారు ఇప్పుడు ఇండియాకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
గూగుల్ తమ ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు తీవ్రంగా ఆలస్యమవుతున్న నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు దేశం విడిచి బయటకు వెళ్లవద్దని గూగుల్ సూచించింది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
గూగుల్ న్యాయ నిపుణుల అంచనా ప్రకారం.. అమెరికా వెలుపలికి వెళ్లిన ఉద్యోగులు తిరిగి దేశంలోకి రావాలంటే వీసా స్టాంపింగ్ తప్పనిసరి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీసా అపాయింట్ మెంట్లు నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. ఈ కారణంగా తిరిగి అమెరికాలోకి ప్రవేశించడం కష్టంగా మారే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. అందుకే యూఎస్ వీసాల పై ఉన్న ఉద్యోగులు అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని గూగుల్ యాజమాన్యం మెయిల్ ద్వారా సూచించింది.
డిసెంబర్ 15 నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియా వెట్టింగ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంతో వీసా అపాయింట్ మెంట్లలో భారీ జాప్యం ఏర్పడుతోంది. హెచ్1బీ, హెచ్4 మాత్రమేకాకుండా ఎఫ్, జే, ఎం వంటి ఇతర వీసాలపైనా దీని ప్రభావం ఉంటుందని గూగుల్ నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగుల విషయంలో మాత్రం సంస్థ ప్రత్యేక సూచనలు ఇవ్వలేదని సమాచారం.
కొత్త వెట్టింగ్ విధానం కారణంగా వీసా ఇంటర్వ్యూలను తొలుత 2026 ఫిబ్రవరి మార్చి వరకూ రీషెడ్యూల్ చేసినట్లు అమెరికన్ ఎంబసీ అధికారులు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీలను మరింతగా వాయిదా వేసి అక్టోబర్ నెలకు మార్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను సవివరంగా పరిశీలించేందుకు అదనపు సమయం అవసరమవుతుండడంతోనే ఈ జాప్యం జరుగుతోందని అమెరికా అధికారులు వివరణ ఇస్తున్నారు.
ఈ పరిణామాలతో వీసా దరఖాస్తుదారులు తీవ్ర గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న అనేకమంది ఈ ఆలస్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం ఎప్పటివరకూ కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో, విదేశీ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.