కాంగ్రెస్ ఓవర్ లోడయిపోతుందా ?

ఒకపుడు కళా కాంతులు లేకుండా ఉన్న గాంధీభవన్ ఇపుడు జీవంతో కళకళలాడిపోతోంది. దానికి కారణం ఏమిటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించటమే.

Update: 2023-07-20 04:52 GMT

ఒకపుడు కళా కాంతులు లేకుండా ఉన్న గాంధీభవన్ ఇపుడు జీవంతో కళకళలాడిపోతోంది. దానికి కారణం ఏమిటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించటమే. కర్నాటకలో విజయం ప్రభావం తెలంగాణా మీద కూడా పడినట్లుంది. అందుకనే చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరటానికి బాగా ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు చేరిపోయారు. తొందరలోనే మరికొందరు చేరటానికి వివిధ స్ధాయిలో మంతనాలు జరుపుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే మరికొందరు ప్రముఖ నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డి చేరబోతున్నారట. వీళ్ళిద్దరితో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చర్చలు కూడా అయిపోయాయని సమాచారం.

అలాగే ప్రముఖ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని ముత్యాల సునీల్ రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మందుల సామేల్, గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత, ముథోల్ నియోజకవర్గానికి చెందిన రాజారావు పటేల్ తొందరలో హస్తం కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.

Read more!

వీళ్ళు కాకుండా కొంతమంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బాగా ప్రచారమవుతోంది. వీళ్ళంతా కాకుండా వైఎస్ షర్మిల జాయినింగ్ ప్రచారం ఎటూ సా.... గుతునే ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంతమంది చేరిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓవర్ లోడ్ అయిపోతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అవసరానికి మించి నేతలు చేరిపోతే పార్టీనే ఇబ్బంది పడుతుంది. మందెక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెతలాగ తయారవుతుందేమో వ్యవహారం.

ఎక్కువమంది నేతలు చేరితే ఏమవుతుందంటే ఎన్నికల సమయంలో టికెట్ల దగ్గర గోల పెరిగిపోతుంది. ఇపుడు ఏ హామీతో పార్టీలో చేరుతున్నా సరిగ్గా ఎన్నికల నాటికి టికెట్ల కోసం గోల చేయకుండా ఉండరు. అప్పుడు పాత-కొత్త నేతల మధ్య వివాదాలు రాజుకోవటం ఖాయం. ఎంతమందికి టికెట్లిస్తారు ? ఎంతమందికి ఎంఎల్సీ, కీలక పదవుల హామీలిస్తారు ? చేర్చుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఓవర్ లోడుతో ఇబ్బందులు పడకుండా ఉంటుంది.

Tags:    

Similar News