యువరాజ్ సైన్ చేసిన జెర్సీని డస్ట్‌బిన్‌లో పడేసిన స్టువార్ట్ బ్రాడ్: అసలు కథ ఏంటి?
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ పై ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన చారిత్రక ఘట్టాన్ని క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.;
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ పై ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన చారిత్రక ఘట్టాన్ని క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఆ ఒక్క ఓవర్‌తో బ్రాడ్ పేరు క్రికెట్ చరిత్రలో ఒక సంచలన రికార్డుకు చిరునామాగా నిలిచింది. అయితే ఆ సంఘటన తర్వాత బ్రాడ్ తండ్రి ఇచ్చిన ఓ గిఫ్ట్.. అతని కుమారుడిని ఎంతగానో అసహనానికి గురి చేసిందట!
* డస్ట్‌బిన్‌లో పడ్డ యువరాజ్ సైన్ చేసిన జెర్సీ
స్టువార్ట్ బ్రాడ్ తండ్రి, మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ అయిన క్రిస్ బ్రాడ్, ఇటీవల ‘ది టెలిగ్రాఫ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. "2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ నా కుమారుడిపై ఆరు సిక్స్‌లు బాదిన ఘటనను నేను కాస్త హాస్యంగా తీసుకున్నాను. అప్పుడు నేను యువరాజ్ సింగ్ సంతకం చేసిన భారత జెర్సీని తీసుకుని క్రిస్మస్ గిఫ్ట్‌గా స్టువార్ట్‌కి ఇచ్చాను." కానీ ఈ తమాషా ప్రయత్నం స్టువార్ట్‌కు ఏమాత్రం నచ్చలేదట. "అతను ఆ గిఫ్ట్‌ను తెరిచి చూసి, కోపంతో నేరుగా డస్ట్‌బిన్‌లో వేసేశాడు" అని క్రిస్ బ్రాడ్ నవ్వుతూ చెప్పారు.
క్రిస్ బ్రాడ్ మాటల్లో "ఆ సమయంలో ఆ సంఘటనను అతను సరదాగా తీసుకోలేకపోయాడు. నేను సరదాగా చేశాను, కానీ అతడికి మాత్రం ఆ హాస్యం నచ్చలేదు," అన్నారు. అంత పెద్ద అవమానం తర్వాత కూడా తండ్రి అదే సంఘటనను గుర్తుచేస్తూ గిఫ్ట్ ఇవ్వడం బ్రాడ్‌ను మరింత ఆవేదనకు గురిచేసిందని అర్థమవుతుంది.
*అపజయం నుండి అద్భుత కెరీర్‌గా
ఆ ఘోర ఓవర్ తర్వాత స్టువార్ట్ బ్రాడ్ మరింత బలంగా తిరిగి నిలదొక్కుకున్నాడు. టీ20ల్లో ఆశించినంత విజయాలు సాధించకపోయినా, టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇంగ్లాండ్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు.
*167 టెస్టుల్లో 604 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానాన్ని సంపాదించాడు. వేగంగా 600 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గా రెండో స్థానాన్ని సంపాదించుకుని 2023లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
* బ్యాటింగ్ సాయంపై తండ్రి అసంతృప్తి
క్రిస్ బ్రాడ్ తన కుమారుడి బ్యాటింగ్ గురించి కూడా కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి నెట్ ప్రాక్టీస్‌లో స్టువార్ట్‌కి ఒక గంటపాటు బ్యాటింగ్‌లో సాయం చేసినప్పుడు, ఆ తర్వాత ఇంగ్లాండ్ తరఫున మంచి రన్స్ చేసిన తన కుమారుడు మీడియా ముందు కోచ్ పాల్ ఫార్బ్రేస్‌కి మాత్రమే ధన్యవాదాలు చెప్పాడట.
"నేను ‘నీ నాన్న ఎక్కడ?’ అని అడిగితే ‘అది రాజకీయంగా సరైన మాట కాదు కాబట్టి చెప్పలేను’ అన్నాడు. నాకు కొంచెం బాధేసింది," అని క్రిస్ బ్రాడ్ పంచుకున్నారు. తాను బ్యాటింగ్‌లో సహాయం చేయాలని ప్రయత్నించినా, స్టువార్ట్ మాత్రం ఎప్పుడూ 'నేను బౌలర్‌ను, బ్యాట్స్‌మన్‌ను కాదు' అనేవాడని క్రిస్ బ్రాడ్ గుర్తుచేసుకున్నారు.
ఈ ఘటన ఒక తండ్రి-కుమారుడి మధ్య క్రికెట్‌కి ఉన్న బలమైన అనుబంధాన్ని, అలాగే అత్యున్నత స్థాయి క్రీడాకారుల మానసిక పోరాటాన్ని మరోసారి మనకు గుర్తుచేస్తుంది.