ఒ‍క్కడే 120.. జట్టంతా 92.. పాక్‌ జట్టుపై 'బంతాట'..

నేను పోటీ క్రికెట్‌లో ఉన్న రోజుల్లో జట్టుగా ఆడేవాళ్లం..! ఎవరికి వారే సత్తా ప్రదర్శించాలని పట్టుదల చూపేవాళ్లం.. ఒకరిద్దరు మీద ఎప్పుడూ జట్టు ఆధారపడలేదు.;

Update: 2025-08-14 22:30 GMT

నేను పోటీ క్రికెట్‌లో ఉన్న రోజుల్లో జట్టుగా ఆడేవాళ్లం..! ఎవరికి వారే సత్తా ప్రదర్శించాలని పట్టుదల చూపేవాళ్లం.. ఒకరిద్దరు మీద ఎప్పుడూ జట్టు ఆధారపడలేదు. తలో చేయి వేసేవాళ్లమే కాని.. ఎవరూ తప్పించుకోవాలని చూసేవాళ్లం కాదు.

-పాకిస్థాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌

మా పాకిస్థాన్‌ జట్టుతో ఆసియా కప్‌లో భారత్‌ ఆడొద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే టీమ్‌ ఇండియా చేతిలో కచ్చితంగా చిత్తుచిత్తుగా ఓడిపోతాం కాబట్టి.

-భారత్‌పై పలుసార్లు మ్యాచ్‌లను గెలిపించిన పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ బసిత్‌ అలీ

...ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు ఇప్పుడు పాకిస్థాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టును ఓ ఆట ఆడుకుంటున్నారు. కారణం.. తాజాగా వెస్టిండీస్‌ చేతిలో పాక్‌ ఏకంగా 202 పరుగుల తేడాతో ఓడిపోవడమే. ఏడాదిన్నర కిందట జరిగిన వన్డే ప్రపంచ కప్‌నకు అసలు అర్హతే సాధించని వెస్టిండీస్‌ చరిత్రలో లేని స్థాయిలో భారీ తేడాతో పాక్‌ను మట్టికరిపిచడం ఆ దేశ మాజీ క్రికెటర్లను తీవ్రంగా బాధిస్తోంది. అందుకనే.. పాక్‌ క్రికెట్‌ జట్టుపై మండిపడుతున్నారు.

జట్టంతా కలిసినా వంద కొట్టలేదు...

పాక్‌-వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడ్డాయి. మొదటి వన్డేను పాక్‌ నెగ్గగా, చివరి రెండింటిలో విండీస్‌ గెలిచింది. మరీ ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ 94 బంతుల్లో 120 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 294/6 స్కోరు చేసింది. ప్రతిగా పాక్‌ 92 పరుగులకే ఆలౌటైంది. అంటే హోప్‌ ఒక్కడు చేసిన పరుగులైన పాక్‌ జట్టంతా కలిపి చేయలేకపోయింది. ఆ జట్టులో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్‌ అయ్యారు. కెప్టెన్‌ రిజ్వాన్‌ మొదటి బంతికే అత్యంత చెత్తగా బౌల్డయ్యాడు. వెస్టిండీస్‌ చేతిలో పరుగుల పరంగా పాక్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. దీంతోనే పాక్‌ మాజీ క్రికెటర్లు నోటికి పనిచెబుతున్నారు.

10-15 ఏళ్లుగా పతనావస్థలో...

పాక్‌ ఆటగాళ్లు 10-15 ఏళ్లుగా స‍్వలాభం కోసమే ఆడుతున్నారని.. సగటు మెరుగుపరుచుకోవడమే వారి ధ్యేయం అని అక్తర్‌ నిందించాడు. దేశం కోసం ఆడాలన్న సృ‍్పహ లేదన్నాడు. ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉందన్నాడు. రావల్పిండిలో ఆడినట్లు వెస్టిండీస్‌లో ఆడతామంటే ఎలాగని ప్రశ్నించాడు.

అత్యంత చెత్తగా రిజ్వాన్‌ ఔట్‌...

పాక్‌పై మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది వెస్టిండీస్‌. చివరి మ్యాచ్‌లో రిజ్వాన్‌ బౌల్డయిన తీరు ఆ జట్టు ప్రమాణాలకు అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. విండీస్‌ పేసర్‌ సీల్స్ ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతి స్వింగ్‌ అయి రిజ్వాన్‌ వికెట్లను లేపేసింది. ఇది బయటకు వెళ్తోందని రిజ్వాన్‌ వదిలేయగా.. లోపలకు వచ్చి వికెట్లను గిరాటేసింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ‘‘ఈ సంవత్సరంలో అత్యంత చెత్తగా వదిలేసిన బంతి ఇదే అని ఒకరు, అసలు ఇలా కూడా వదిలేస్తారా?’’ అని మరొకరు అంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Tags:    

Similar News