గుస‌గుస‌: వైభ‌వ్ సూర్య‌వంశీ అంటే గిట్ట‌నివాళ్లున్నారా?

అయితే ఇంత చిన్న వ‌య‌సులో అత‌డి వేగం, అదృష్టం చూస్తుంటే కొంద‌రికి ఇది గిట్ట‌డం లేద‌ని సోష‌ల్ మీడియాల్లో క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Update: 2026-06-16 16:30 GMT

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత దూకుడైన ఆట తీరుతో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. అత‌డి ప్ర‌తిభ‌కు బీసీసీఐ రెడ్ కార్పెట్ వేసి ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రిస్తోంది. ఇప్పుడు ఒక‌ అరుదైన, ప్రతిష్టాత్మకమైన అవకాశాన్ని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దక్కించుకున్నాడు. త్వరలో జ‌ర‌గ‌నున్న‌ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 పర్యటనల కోసం భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.

అయితే ఇంత చిన్న వ‌య‌సులో అత‌డి వేగం, అదృష్టం చూస్తుంటే కొంద‌రికి ఇది గిట్ట‌డం లేద‌ని సోష‌ల్ మీడియాల్లో క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. క్రికెట్ లో అత‌డి ఎదుగుద‌ల కొంద‌రు సీనియ‌ర్ల‌కు న‌చ్చ‌డం లేద‌ట‌. సీనియర్ భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్న తరుణంలో వైభవ్ చుట్టూ నడుస్తున్న ఈ గుసగుసలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

క్రికెట్ అడిక్టర్ క‌థ‌నం ప్రకారం... ప్రముఖ జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ఒక ఆన్‌లైన్ చర్చలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బిసిసిఐ లోని ఒక విశ్వసనీయ సోర్స్ ప్ర‌కారం.. ఈ 15 ఏళ్ల బ్యాటర్ అనూహ్య ఎదుగుదలను భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. వైభవ్ ఇంత త్వరగా వెలుగులోకి రావడం ఇండస్ట్రీలోని కొందరికి అంతగా నచ్చడం లేదని, ఇంత చిన్న వయసులోనే అతడిని సీనియర్ అంతర్జాతీయ జట్టులోకి అంత వేగంగా పంపించవద్దని సదరు ఆటగాళ్లు బోర్డు అధికారులకు సలహా ఇచ్చినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి.

అయితే వైభవ్‌కు ఇంతటి గుర్తింపు, ఆదరణ దక్కడానికి కారణం ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అతడు సృష్టించిన ప్రభంజనమేనని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఈ యువ ఆటగాడు, ఆరంగేట్రం చేసిన సీజన్ లోనే తన అద్భుత ప్రదర్శనతో ఏకంగా `ఆరెంజ్ క్యాప్` సొంతం చేసుకున్నాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.30 రికార్డు స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. భయం తెలియని బ్యాటింగ్ శైలి, వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యంతో వైభవ్ రాత్రికి రాత్రే భారత క్రికెట్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ స్టార్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు తమ కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో టీమిండియా తదుపరి సూపర్ స్టార్ కోసం అన్వేషణ సాగిస్తోంది. ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వైభవ్‌కు ఉందని మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ ఫామ్ కారణంగానే అతడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు జపాన్‌లో జరగనున్న‌ 2026 ఆసియా క్రీడల భారత జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అక్క‌డ టి-20 టోర్నీలో ఆడ‌తాడు. త్వరలోనే అంతర్జాతీయ ఆరంగేట్రం చేయబోతున్న వైభవ్... అతి పిన్న వయసులోనే భారత్ తరఫున ఆడి సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన కొన్ని రికార్డులను సైతం బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. బ్రిటన్ పర్యటనకు వెళ్లే ముందు శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో వైభవ్ ఇంకా తన అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు 14, 44, 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకవైపు అతని ఫామ్ గురించి.. మరోవైపు జట్టులో అతని ఎదుగుదలను వ్యతిరేకిస్తున్నారనే గుస‌గుస‌లపై ఈ టీనేజ్ సంచలనం ఎలా స్పందిస్తాడో... తన ఆటతో వీట‌న్నిటికీ ఎలా సమాధానం చెబుతాడో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్రతిభావంతుడైన ఆటగాడి భవిష్యత్ ప్రయాణంపై క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News