ఏ ప్రాంతమైతే ఏంటి? అప్పట్లో హైదరాబాదీ తిలక్ అడ్రస్ కష్టమైంది
ఆసియా కప్ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను గెలిపించాడు తిలక్ వర్మ. ఇప్పుడు అతడు నేషనల్ హీరో.;
అది 2018.. హైదరాబాద్ జూనియర్ క్రికెట్లో ఓ కుర్రాడు సంచలన రీతిలో ఆడుతున్నాడు . తన వయసు కంటే పెద్ద గ్రూప్ టోర్నీల్లో చితక్కొడుతున్నాడు. ఓ ప్రధాన పత్రిక స్పోర్ట్స్ జర్నలిస్టు అతడి ప్రతిభను గుర్తించాడు. ఇతడు కచ్చితంగా టీమ్ ఇండియాకు ఆడతాడని భావించాడు. అప్పటికి తిలక్ ఇంకా 15 ఏళ్ల కుర్రాడే. కానీ, ప్రతిభ మాత్రం దండి ఉండడంతో రిపోర్టర్ ను పంపి స్టోరీ రాయించాడు. అలా తిలక్ వర్మ గురించి హైదరాబాద్ బయటి వ్యక్తులకు తొలిసారి తెలిసింది. అయితే, అప్పట్లో తిలక్ నివాసాన్ని గుర్తించి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. కట్ చేస్తే..
ఇప్పుడు తిలక్ వర్మ పెద్ద క్రికెటర్. ఆ స్పోర్ట్స్ జర్నలిస్టు ఊహించిందే నిజమైంది.
నేషనల్ హీరోకు ప్రాంతంతో పనేంటి?
ఆసియా కప్ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను గెలిపించాడు తిలక్ వర్మ. ఇప్పుడు అతడు నేషనల్ హీరో. ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ లో ఆడడం ద్వారా మిగతా దేశానికి పరిచయం అయినా.. అది ఓ బ్యాట్స్ మన్ గానే. ఇప్పుడు మాత్రం మ్యాచ్ విన్నర్. దీంతోనే తెలుగు వారు అతడు ఏ ఊరివాడు? అని సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. నెట్ లో వెదకడం వంటి పనులు చేస్తున్నారు. కానీ, నేషనల్ హీరోకు ప్రాంతంతో పనేంటి? అతడు దేశం గర్వపడేలా చేశాడు అని ఆలోచించడం లేదు.
ఇదీ నేపథ్యం...
తిలక్ తండ్రిది హైదరాబాద్ శివారు మేడ్చల్. తల్లిది ఏపీలోని భీమవరం. తాను పుట్టిపెరిగింది అంతా కూకట్ పల్లిలో అని తిలక్ గతంలో చెప్పాడు. ఇక తన ఇంటి పేరు నంబూరి. ఈ లెక్కన అతడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. తమ ముత్తాతల నుంచి ఠాకూర్ అనేది వస్తోందని కూడా తిలక్ స్పష్టం చేశారు. 2002 నవంబరు 8న పుట్టాడు తిలక్. తన కెరీర్ ఆసాంతం హైదరాబాద్ లోనే సాగింది.
కొసమెరుపుః తెలుగు రాష్ట్రాల క్రికెట్ లో హైదరాబాద్, ఆంధ్రా రంజీ జట్లు ఉన్నాయి. పూర్తిగా తెలుగు మాట్లాడగలిగిన వారు అయితేనే వారిని తెలుగువారిగా పిలుస్తుంటారు. మొహమ్మద్ అజహరుద్దీన్, మొహమ్మద్ సిరాజ్ లను హైదరాబాదీలనే అంటారు. హైదరాబాద్ కే చెందినప్పటికీ తిలక్ మాత్రం అచ్చ తెలుగువాడు.