నేను ఔటైతే.. దేశమే ఓడినట్లనుకున్నా..ఫైనల్లో ఇన్నింగ్స్ పై తిలక్
సాధారణ జట్టుతో ఆడితేనే చివరి ఓవర్లో గెలుపునకు అవసరమై పరుగులు సాధించాలంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది...! అదే పాకిస్థాన్ తో అయితే.. ఇక ఫైనల్ వంటి మ్యాచ్ లో అయితే..? ఆ క్రికెటర్ కు ఎన్ని గుండెలు ఉండాలో...? అలాంటి ఇన్నింగ్సే ఆడి భారత జట్టును గెలిపించాడు తిలక్ వర్మ.
పాకిస్థాన్ తో ఆసియా కప్ ఫైనల్ ముగిసి రెండో రోజు గడుస్తున్నా.. ఆ వైబ్ ఇంకా ప్రజల్లో అలానే ఉంది..! ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఇంకా కళ్లలో మెదులుతూనే ఉంది.. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ కు శంషాబాద్ విమానాశ్రయంలో భారీ స్వాగతం లభించింది. మంగళవారం అతడు లింగంపల్లిలోని లేగల గ్రౌండ్ ను సందర్శించాడు. శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ తో ఫైనల్ సందర్భంగా ఎదుర్కొన్న ఉత్కంఠభరిత పరిస్థితులను వివరించాడు.
నేను ఔటతే... దేశం ఓడినట్లేననుకున్నా...
20 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన స్థితిలో తాను దేశానికి ఆడుతున్న ఏకైక భావనతో ముందుకెళ్లానని.. అదే తనను నడిపించిందని తిలక్ వర్మ చెప్పాడు. ఒకవేళ మూడు వికెట్లు పడ్డాయనే టెన్షన్ లో తానూ ఒత్తిడికి గురై ఔట్ అయితే దేశం మొత్తాన్ని దించేసినట్లు అవుతుందని భావించి ధైర్యంగా నిలుచున్నట్లు తెలిపాడు. తనను తాను సంభాళించుకుని పరుగులు చేసుకుంటూ వెళ్లినట్లు పేర్కొన్నాడు. నా దేశం కోసం నేను గెలవాలి అనే లక్ష్యం ఒక్కటే తన కళ్లముందు కనిపించిందని.. దానినే ఊహించుకుంటూ వెళ్లానని వివరించాడు.
మాటల్లో చెప్పలేనంతగా దూషించారు...
ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు క్లిష్టంగా మారాయని.. ఈ ప్రభావం మైదానంలోనూ కనిపించిందని తిలక్ తెలిపాడు. పాక్ ఆటగాళ్లు చాలా హార్డ్ గా వచ్చారని.. ఫైనలో స్లెడ్జింగ్ చేశారని.. అది మీడియా ముందు చెప్పలేనంతగా స్లెడ్జింగ్ చేశారని వివరించాడు. వారు చాలా మాట్లాడారని.. ఆ సమయంలో తాను కామ్ గా ఉంది... బ్యాట్ తో గెలిపిస్తే అంతా బాగవుతుందని భావించానని అన్నాడు.
వాడు ప్రపంచ బౌలర్ అయితే.. నేను ది బెస్ట్ బ్యాటర్..
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో... పాక్ బౌలర్ హారిస్ రవూప్ ప్రపంచ స్థాయి బౌలర్ అయినా.. తనను తాను ది బెస్ట్ ప్లేయర్ గా భావించుకున్నానని తిలక్ వర్మ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చాడు. ఆ టైమ్ లో తాను ఇదొక్కటే మైండ్ లో పెట్టుకున్నట్లు తెలిపాడు. అవతలి ఎండ్ లోని సంజూ శాంసన్ తో సమన్వయం చేసుకున్నానని, ఒత్తిడిని తాను స్వీకరించినట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి ఆల్ రౌండర్ శివమ్ దూబె ఒత్తిడితోనే క్రీజులోకి వచ్చాడని... పార్ట్ నర్ షిప్ లో దానిని తగ్గించుకుంటూ వెళ్లామన్నాడు.
-కోహ్లిని తాను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని.. అతడిని రీ ప్లేస్ చేశానంటూ తనను పోల్చడం గర్వకారణం అని తిలక్ వివరించాడు. 2011 వన్డే ప్రపంచ కప్ తర్వాత తాను క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టానని.. వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ ను గెలిపించడమే తన లక్ష్యం అని తిలక్ చెప్పాడు.