సీఎం సర్.. ఇదిగో ఆసియా కప్ బ్యాట్.. రేవంత్ కు తిలక్ బహుమతి
మంగళవారం లింగంపల్లిలోని క్రికెట్ అకాడమీకి వెళ్లారు.. ఆ వెంటనే సాయంత్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు.;
ఆసియా కప్ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ (69 నాటౌట్) అనంతరం దేశ హీరో అయిపోయాడు హైదరాబాదీ తిలక్ వర్మ. ఇప్పుడు అతడు ఎక్కడకు వెళ్లినా పెద్ద అభిమాన గణమే తరలివస్తోంది. దీంతోపాటు తిలక్ ఫుల్ బిజీగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో ఆదివారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. అర్థరాత్రి వరకు మైదానంలోనే గడిపిన తిలక్ సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. మంగళవారం లింగంపల్లిలోని క్రికెట్ అకాడమీకి వెళ్లారు.. ఆ వెంటనే సాయంత్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. ఇంతగా బిజీబిజీగా ఉన్న అతడు.. సీఎం రేవంత్ కు ఒక విలువైన బహుమతి కూడా ఇచ్చాడు.
జూబ్లీహిల్స్ ఇంట్లో...
జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన తిలక్.. కొద్దిసేపు ముచ్చటించాడు. తన వెంట తెచ్చిన బ్యాట్ ను రేవంత్ కు బహూకరించాడు. బ్యాట్ గురించి కొన్ని వివరాలను తిలక్ సీఎంకు వివరిస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కొందరైతే.. ఎడమచేతి వాటం తిలక్ తిలక్ ఆసియా కప్ ఫైనల్లో ఆడిన బ్యాట్ ఇదే? అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక రేవంత్ కూడా బ్యాట్ తీసుకుని నేను కూడా ఆడేందుకు సిద్ధం అన్నట్లు పోజు ఇచ్చారు.
అప్పుడు సిరాజ్ ఇప్పుడు తిలక్...
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో హైదరాబాద్ క్రికెట్ పేరు మార్మోగుతోంది. ఇంగ్లండ్ టూర్ లో పేసర్ సిరాజ్ అద్భుతంగా పోరాడి సిరీస్ 2-2తో డ్రాకావడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు తిలక్ వర్మ కూడా అదే స్థాయి ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇంగ్లండ్ టూర్ అనంతరం వచ్చీ రాగానే సిరాజ్ సీఎం రేవంత్ ను కలిసి అభినందనలు పొందాడు. ఇప్పుడు తిలక్ సైతం అదే పనిచేశాడు. కాగా, సిరాజ్ ను రేవంత్ ప్రభుత్వం యూసుఫ్ గూడలోని పోలీస్ అకాడమీ డీఎస్పీగా నియమించింది. మరి తిలక్ కు ఏం ఉద్యోగం ఇస్తుందో చూడాలి.
నజరానా గట్టిగానే...?
సిరాజ్ తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషాసింగ్ కు రేవంత్ ప్రభుత్వం భారీ నజరానాలు ఇచ్చింది. ఇప్పుడు తిలక్ కు ఏం బహుమతి ప్రకటిస్తారో చూడాలి. నగదు, ఇళ్ల స్థలం, ఉద్యోగం వీటిలో ఏది ఇస్తారనేది కూడా ఆసక్తికరం కానుంది.