చేతిలో క‌ప్ లేదు కానీ.. ‘క‌ప్పొం’గేలా టీమ్ ఇండియా ఆట‌గాళ్ల సంబ‌రాలు

పాక్ ప్రేరేపిత‌మైన పెహ‌ల్గాం వంటి దారుణ‌మైన ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌కుంటే... ఆసియా క‌ప్ లో టీమ్ ఇండియా విజేత‌గా నిలిచాక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స‌గ‌ర్వంగా ట్రోఫీని పైకెత్తేవాడు.;

Update: 2025-09-29 09:48 GMT

ఏదైనా టోర్నీలో క‌ప్ కొట్ట‌గానే ప్ర‌జంటేష‌న్ పోడియం వ‌ద్ద‌కు చేరుకునే ఆట‌గాళ్లు... విజ‌యోత్సాహంతో సందండి సందడి చేస్తారు..! వికెట్లు చేతిలో ప‌ట్టుకుని షాంపేన్ లు చిందిస్తారు..! స్ఫూర్తిదాయ‌క‌మైన కెప్టెన్లు అయితే జ‌ట్టులో జూనియ‌ర్లకు క‌ప్ అందించి తాము వెనుక నిలుస్తారు.. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో డ‌క్ వాక్ (బాతు త‌ర‌హాలో న‌డుస్తూ) చేస్తూ క‌ప్ అందుకునే స్ట‌యిల్ బాగా పాపుల‌ర్ అయింది...! కానీ, ఆసియా క‌ప్ లో ఇలాంటివేవీ క‌నిపించ‌లేదు. కార‌ణం.. పాకిస్థాన్ మంత్రి అయిన‌, పీసీబీ అధ్య‌క్షుడు అయిన‌, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్య‌క్షుడు మొహిసిన్ న‌ఖ్వీ నుంచి ట్రోఫీ అందుకునేందుకు టీమ్ ఇండియా ఆటగాళ్లు నిరాక‌రించ‌డ‌మే. దీంతో మొహం చిన్న‌బోయిన న‌ఖ్వీ ఏకంగా క‌ప్ నే త‌న హోటల్ రూమ్ కు ఎత్తుకెళ్లాడు.


క‌ప్ లేక‌పోతేనేం...?

పాక్ ప్రేరేపిత‌మైన పెహ‌ల్గాం వంటి దారుణ‌మైన ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌కుంటే... ఆసియా క‌ప్ లో టీమ్ ఇండియా విజేత‌గా నిలిచాక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స‌గ‌ర్వంగా ట్రోఫీని పైకెత్తేవాడు. వైస్ కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్, అత‌డి స‌హ‌చ‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ట్రోఫీ పై ఓ చేయి వేసేవారు. ఫైన‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ కు స్పెష‌ల్ గా ట్రీట్ ఉండేదే...! కానీ, అస‌లు ప్ర‌జంటేష‌న్ సెర్మ‌నీకే టీమ్ ఇండియా దూరంగా ఉంది. మొహిసిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా క‌ప్ అందుకుని.. పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి బాధితుల‌కు గుండె కోత మిగిల్చిన‌ట్లే అయ్యేది. అందుక‌ని.. వారికి నివాళిగా, పాక్ తీరుకు నిర‌స‌న‌గా న‌ఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేది లేదు పో అని తేల్చి చెప్పింది.


మ‌రి సెల‌బ్రేష‌న్స్ ఎలా..?

ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా యుగం క‌దా..? చేతిలో క‌ప్ లేక‌పోతేనేం..? అత్యంత అధునాత‌న టెక్నాల‌జీ ఉందిగా..? అందుకే దానినే ఫాలో అయ్యారు టీమ్ ఇండియా అభిమానులు.. మంచి స్నేహితులైన యువ ఓపెన‌ర్లు గిల్, అభిషేక్ లు గ‌తంలో దిగిన ఫొటోల‌కు త‌గ్గ‌ట్లు వారి మ‌ధ్య‌లో క‌ప్ ను ఉంచారు.. టీమ్ ఇండియా ఆట‌గాళ్లు ఆసియాక క‌ప్ ప్ర‌జంటేష‌న్ పోడియం వ‌ద్ద చేసుకున్న సంబ‌రాల ఫొటో మ‌ధ్య‌లోనూ క‌ప్ ను ఉంచారు. ఇదే కాదు.. ఇంకా ర‌క‌ర‌కాలుగానూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ టీమ్ ఇండియా ఆసియా క‌ప్ గెలిచిన సంబ‌రాన్ని మ‌న‌సులోనే అంబ‌రం అంటేలా జ‌రుపుకొన్నారు.

Tags:    

Similar News