గౌతమ్ గంభీర్- విరాట్ కోహ్లి.. ఏదో తేడాగా ఉంది?.. ఇది నిజం
ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలానే విశాఖ మ్యాచ్ అనంతరం కోహ్లి వ్యవహరించిన తీరునూ పోస్ట్ చేశారు.;
టీమ్ ఇండియాకు కలిసి ఆడిన రోజుల్లోనూ పెద్దగా సఖ్యత లేదు. ఐపీఎల్ లోనూ ఢీ అంటే ఢీ.. ఇప్పుడు కోచ్ గా వచ్చాక సత్సంబంధాలే లేవు.. ఇదీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య నెలకొన్న రగడ..! తాజాగా దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డే అనంతరం ఈ విషయం మరింత స్పష్టమైంది. గంభీర్ ముక్కుసూటి మనిషి.. కోహ్లి దూకుడైన పోరాట పటిమ చూపేవాడు. ఇద్దరూ ఢిల్లీవారే. ఆటలోనూ, మాటలోనూ ఢిల్లీవాళ్లకు ఉండే నేచురల్ టెంపర్ ఇద్దరిలోనూ ఉంది. దీంతోనే వీరికి ఒకరంటే ఒకరితో పొసగదు అనేది తేలిపోతోంది.
గంభీర్ వచ్చాక టీమ్ ఇండియాను తనదైన శైలిలో పునర్ నిర్మాణం చేయాలనుకుంటున్నాడు. గత ఏడాది న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను స్వదేశంలో 0-3తో కోల్పోవడం, ఆ వెంటనే ఆస్ట్రేలియాలో 1-3తో టెస్టు సిరీస్ ఓటమితో గంభీర్ ఆలోచన మారింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లిల వైఫల్యం టెస్టుల్లో స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ లో చివరి ఐదో టెస్టుకు రోహిత్ ను తప్పించాడు కూడా. దీంతోనే వారిద్దరినీ ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమైంది. ఇదే విషయాన్ని చేరవేయడంతో రోహిత్- కోహ్లి వెంటవెంటనే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చారు.
వన్డేల నుంచి సాగనంపుదామని...
రోహిత్-కోహ్లి గత ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ కు బైబై చెప్పారు. అప్పటికి వారు టెస్టుల నుంచి తప్పుకొందామని అనుకోలేదు. కానీ, ఏడాది తర్వాత తప్పలేదు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ తరంలో అంతగా ప్రాధాన్యం లేని, అడపాదడపా మాత్రమే మ్యాచ్ లు జరిగే వన్డే ఫార్మాట్ లో కొనసాగడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. వాస్తవానికి ఏమాత్రం వీలు దొరికినా రోహిత్, కోహ్లిలను వన్డేల నుంచి కూడా తప్పించాలనేది గంభీర్ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే ప్రపంచకప్ నాటికి యువకులతో జట్టును నిర్మించాలంటే రోహిత్-కోహ్లిలను తప్పించాలి. అప్పటికి 40 ఏళ్లు వచ్చే రోహిత్, 39 ఏళ్లు ఉండే కోహ్లిల కంటే కుర్రాళ్లయితే బాగుంటుందని గంభీర్ ప్రణాళికల్లో ఉన్నాడు. ఇదే క్రమంలో గంభీర్ తో ఆ ఇద్దరికీ విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది.
విశాఖ వన్డే అనంతరం..
సహజంగా మ్యాచ్ ముగిశాక మైదానం నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు, సొంత జట్టు ఆటగాళ్లతో కరచాలనాలు సహజం. ఇలానే విశాఖపట్నంలో శనివారం మూడో వన్డే అనంతరం మైదానం నుంచి వస్తున్న కోహ్లి.. భారత క్రికెటర్లు, బౌలింగ్ కోచ్ మోర్కెల్ (దక్షిణాఫ్రికా)తో చేయి కలపడంతో పాటు ఆలింగనం చేసుకున్నాడు. కానీ, గంభీర్ దగ్గరకు వచ్చేసరికి కేవలం చేయి కలిపి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో రోహిత్ తో మాత్రం చేయి, భుజం కలిపాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలానే విశాఖ మ్యాచ్ అనంతరం కోహ్లి వ్యవహరించిన తీరునూ పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. గంభీర్ ను చూశాక కోహ్లి బాడీ లాంగ్వేజ్ కూడా మారినట్లు పేర్కొంటున్నారు. గంభీర్ కు తప్పదన్నట్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆ సమయంలో మూడ్ మారినట్లు కనిపించడాన్ని ప్రస్తావిస్తున్నారు. గంభీర్ ను దాటి వెళ్లాక మళ్లీ కోహ్లి హుషారుగా మారాడని విశ్లేషిస్తున్నారు.