5 సెంచరీలు చేసి..ఐదో రోజు ఓటమి..టీమ్‌ ఇండియా ఇదొక చరిత్ర !

-బ్యాటింగ్‌తో పోల్చితే టీమ్‌ ఇండియా బౌలింగ్‌ బలహీనంగా ఉంది. తుది జట్టులో మూడో పేసర్‌గా ఎవరు ఉండాలి అనేది తేల్చుకోవాలి.;

Update: 2025-06-25 04:24 GMT

మూడు నెలలు కర్రసాము చేసి మూలనున్న ముసలామె మీద ప్రతాపం చూపాడని వెనుకటికి ఒక సామెత..! దీన్ని కాస్త అటుఇటు మార్చితే టీమ్‌ ఇండియా ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇంగ్లండ్‌తో హెడింగ్లీలోని లీడ్స్‌ మైదానంలో తొలి టెస్టులో భారత జట్టు ఓడిపోయింది. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌లోనే పరాజయం మూటగట్టుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో భారత్‌దే చాలావరకు పైచేయి.. కానీ, ఇంగ్లండ్‌ క్రమక్రమంగా పట్టుసాధించి ఏకంగా టెస్టును ఖాతాలో వేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ)ను టీమ్‌ ఇండియా పరాజయంతో మొదలుపెట్టేలా చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జైశ్వాల్‌, కెప్టెన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌-వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ సెంచరీలతో టెస్టును సూపర్‌గా ప్రారంభించింది. 471 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను 465 వద్ద ఆపింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. 371 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ టెస్టు ద్వారా గిల్‌ సేన చాలా నేర్చుకోవాల్సి ఉంది. అవేమిటంటే..?

-బ్యాటింగ్‌తో పోల్చితే టీమ్‌ ఇండియా బౌలింగ్‌ బలహీనంగా ఉంది. తుది జట్టులో మూడో పేసర్‌గా ఎవరు ఉండాలి అనేది తేల్చుకోవాలి. ప్రసిద్ధ్‌ క్రిష్ణ కేవలం బంతులు విసరడానికే అన్నట్లున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లు వేసి 220 పరులిచ్చాడు. ఈ స్థాయిలో ప్రదర్శనకు వికెట్లు తీసినా వేస్ట్‌. కాబట్టి మూడో పేసర్‌గా అర్షదీప్‌ సింగ్‌ను కానీ, ఆకాశ్‌ దీప్‌ను గాని తీసుకునే ఆలోచన చేయాలి.

-లీడ్స్‌ టెస్టులో శుద్ధ దండగ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. తెలుగు కుర్రాడు, పేస్‌ బౌలింగ్‌ వేయగల బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్‌ అయిన నితీశ్‌ కుమార్‌ రెడ్డిని కాదని శార్దూల్‌ను తీసుకుంటే పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా మరింత ఫెయిల్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా 2 వికెట్లు తీసినా అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అసలు శార్దూల్‌కు బంతిని ఇవ్వడమే ఆలస్యం చేశారు. అలాంటివాడు జట్టులో అవసరమా? అనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచించాలి.

-సాయి సుదర్శన్‌ కొత్త కుర్రాడు కాబట్టి అతడికి కొంత సమయం ఇవ్వొచ్చు. అయితే, 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ నాయర్‌ తుస్‌ అనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులే చేశాడు. లోయరార్డర్‌ను కలుపుకొని పోతూ ఒకప్పటి వీవీఎస్‌ లక్ష్మణ్‌లా ఆడాల్సిన వాడు విఫలమయ్యాడు. కరుణ్‌ రెండో టెస్టుకు లోపాలను సరిచేసుకోవాలి.

అసలు లోయరార్డర్‌ ఉందా...?

లీడ్స్‌ టెస్టులో టీమ్‌ ఇండియా లోయరార్డర్‌ మరీ పేలవం. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ నుంచి ఆల్‌ రౌండర్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా.. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో బాధ్యతలకు న్యాయం చేయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొద్ది పరుగులు చేసినా అప్పటికే ఆలస్యమైంది. శార్దూల్‌ ఠాకూర్‌ కూడా పేలవంగా ఆడడంతో లోయరార్డర్‌ నుంచి జట్టుకు ఫాయిదా లేకపోయింది.

ఇన్ని క్యాచ్‌లు మిస్‌ చేస్తారా?

క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి.. కానీ, లీడ్స్‌ టెస్టులో టీమ్‌ ఇండియా ఓపెనర్‌ జైశ్వాల్‌ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. అత్యుత్తమ ఫీల్డర్‌ అయిన జడేజా కూడా ఒక క్యాచ్‌ వదిలేశాడు. దీనిపై వెంటనే ఫోకస్‌ పెట్టాలి. ఇక పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలంగా లేనిది వాస్తవమే. మన బౌలింగ్‌ బలహీనంగా ఉన్నదీ వాస్తవమే. అలాంటప్పుడు డ్రా చేసుకోవాలి. కానీ, ఓడిపోయారు.

-హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు లక్‌ కలిసిరాలేదు. కొంత వైఫల్యం కూడా ఉండడంతో ప్రధాన పేసర్‌ బుమ్రా ఒక్కడే భారం అంతా మోశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాను కాచుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లు ప్రసిద్ధ్‌, శార్దూల్‌ వంటివారిపై ఆకలితో ఉన్న పులుల్లా పడ్డారు. జడేజాను రివర్స్‌ స్వీప్‌లతో ఉతికేశారు.

-మొత్తమ్మీద నాలుగు రోజులు టెస్టులో ఆధిపత్యం చూపిన టీమ్‌ ఇండియా.. చివరి రోజు ఓటమితో ముగించాల్సి వచ్చింది. లోపాలను సరిచేసుకుంటే తప్ప రెండో టెస్టులో అయినా మంచి ఫలితం దక్కదు.

కొసమెరుపుః ఒక టెస్టులో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. లీడ్స్‌లో జైశ్వాల్‌, గిల్‌, పంత్‌ (2), రాహుల్‌ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News