డ్రీమ్ 11 ఔట్...! ఖాళీ జెర్సీతో టీమ్ ఇండియా!

వివాదాల ఆసియా క‌ప్ (టి20 ఫార్మాట్) మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుందన‌గా టీమ్ ఇండియా ఖాళీ జెర్సీల‌తో బ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.;

Update: 2025-08-25 06:58 GMT

వివాదాల ఆసియా క‌ప్ (టి20 ఫార్మాట్) మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుందన‌గా టీమ్ ఇండియా ఖాళీ జెర్సీల‌తో బ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కాలం ఆట‌గాళ్ల జెర్సీల‌పై ఉన్న ప్ర‌ధాన‌ స్పాన్స‌ర్ డ్రీమ్11 వైదొల‌గింది. ఈ స్థానంలోకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేంత స‌మ‌యం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ గేమింగ్ నిషేధం చ‌ట్టం కార‌ణంగా డ్రీమ్ 11 స్పాన్స‌ర్ షిప్ నుంచి ఔట్ అయింది. దీంతో బీసీసీఐ ప్ర‌త్యామ్నాయ స్పాన్స‌ర్ ను వెద‌కాల్సి వ‌స్తోంది. ఇందుకు టెండ‌ర్లు పిల‌వ‌నుంది.

చెల్లించేది ఏమీ ఉండ‌దు...

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. డ్రీమ్ 11 త‌నంత‌ట‌ తాను వైదొల‌గ‌లేదు కాబ‌ట్టి...భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు ఆ సంస్థ చెల్లించాల్సిన‌ది ఏమీ ఉండ‌దు. అంటే.. డ్రీమ్ 11 సేఫ్ కానీ, బీసీసీఐకి లాస్. డ్రీమ్ 11 టీమ్ ఇండియాకే కాదు.. ఐపీఎల్ జెర్సీల్లోనూ ఉంటుంది. 2020లో చైనా సంస్థ వైదొల‌గాక ఆ ప్లేస్ లోకి డ్రీమ్ 11 వ‌చ్చింది. కాగా, 18 ఏళ్ల కింద‌ట ప్రారంభ‌మైన ఈ సంస్థ‌.. 8 బిలియ‌న్ డాల‌ర్ల విలువ‌తో దేశంలోనే అతిపెద్ద ఫాంట‌సీ గేమింగ్ ప్లాట్ ఫామ్ గా ఉంది.

బైజూస్ నుంచి...

రెండేళ్ల కింద‌ట ఎడ్యు-టెక్ స్టార్ట‌ప్ బైజూస్ నుంచి డ్రీమ్ 11 సంస్థ రూ.358 కోట్ల‌కు టీమ్ ఇండియా ప్ర‌ధాన‌ స్పాన్స‌ర్ షిప్ ను తీసుకుంది. ఈ గ‌డువు మూడేళ్లు. అంటే.. 2026 జూలై వ‌ర‌కు ఉంది. డ్రీమ్ 11 బ్రాండ్ ప్ర‌చార‌క‌ర్త‌ల్లో దిగ్గ‌జ క్రికెట‌ర్లు ధోనీ, రోహిత్ తో పాటు మేటి ఆట‌గాళ్లు జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌భ్‌ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. టీమ్ ఇండియానే కాదు... క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్, న్యూజిలాండ్ సూప‌ర్ స్మాష్‌, ఆస్ట్రేలియా బిగ్ బాష్ టోర్నీల‌నూ స్పాన్స‌ర్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

జెర్సీపై పేరు లేకుండానే...

ఫుట్ బాల్, క‌బ‌డ్డీ, హాకీ, ఎన్బీఏ స‌హా ప‌లు క్రీడ‌ల‌కూ డ్రీమ్ 11 స్పాన్స‌ర్ షిప్ విస్త‌రించింది. ఆసియా క‌ప్ సెప్టెంబ‌రు 9 నుంచి మొద‌లుకానుంది. క‌నీసం 15 రోజుల స‌మ‌యం కూడా లేదు. డ్రీమ్ 11 వైదొల‌గ‌డంతో బీసీసీఐకి ఇప్పుడు చిక్కు వ‌చ్చిప‌డింది. జెర్సీలు, బ్రాండింగ్, అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లు వేటిలోనూ డ్రీమ్ 11 లేకుండానే బ‌రిలో దిగాల్సి ఉంటుంది. త‌ర్వాత కొత్త స్పాన్స‌ర్ కోసం వెదుక్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News