చెత్త రికార్డుల సూర్య.. ప్రపంచ కప్ కెప్టెన్ గా కష్టమే!
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక బ్యాటర్ అనడంలో సందేహం లేదు. అతడి గేమ్ సీక్రెట్ అంతా బంతిని కరెక్ట్ గా అంచనా వేసి కనెక్ట్ చేయడం. కానీ, ఇప్పుడు అదే మిస్ అవుతోంది.;
ఒక మ్యాచ్ లో విఫలం అయ్యాడు అంటే సరిపెట్టుకోవచ్చు.. ఒక సిరీస్ లో ఫెయిల్ అయ్యాడు అంటూ సర్దిచెప్పుకోవచ్చు...! విదేశాల్లో ఆడలేకపోయాడంటే ఒప్పుకోవచ్చు.. స్వదేశంలోనూ చేతులెత్తేస్తే బ్యాడ్ లక్ అనుకోవచ్చు..! భారీ స్కోర్లు ఛేజింగ్ లో త్వరగా ఔట్ అయ్యాడంటే ఒత్తిడిగా భావించవచ్చు..! కానీ, అన్నిచోట్లా అన్నిసార్లూ రాణించలేకపోతుంటే ఏమనాలి..? ఆ క్రికెటర్ పూర్తిగా ఫామ్ లో లేడని చెప్పాలి..! బ్యాటర్ అయితే టచ్ పోయిందని అనుకోవాలి..! టీమ్ ఇండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ గా అదీ స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే టి20 ప్రపంచ కప్ లో ఆడబోతున్న భారత జట్టుకు కెప్టెన్ గా ఇతడు సరైనవాడేనా? అసలు జట్టులో చోటు ఇవ్వదగినవాడేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ ఉండగా .. సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు.
టచ్ పోయింది...
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక బ్యాటర్ అనడంలో సందేహం లేదు. అతడి గేమ్ సీక్రెట్ అంతా బంతిని కరెక్ట్ గా అంచనా వేసి కనెక్ట్ చేయడం. కానీ, ఇప్పుడు అదే మిస్ అవుతోంది. బంతిని బాదడంలో సూర్య వైఫల్యం ఏ స్థాయిలో ఉందంటే ఈ క్యాలెండర్ ఇయర్ లో అతడి సగటు 14.20. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యల్ప సగటు నమోదు చేసిన కెప్టెన్ గా చెత్త రికార్డును అతడు మూటగట్టుకున్నాడు. అసలు క్రికెట్ లో ఎవరికీ తెలియని రువాండా జట్టుకు చెందిన కెప్టెన్ క్లింటన్ రుబాగుమ్య (12.52) మాత్రమే ఇంతకంటే తక్కువ సగటు నమోదు చేశాడు. ఏడాదిలో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడి అత్యల్ప యావరేజ్ నమోదు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ (మొదటివాడు అక్షర్ పటేల్.. 2022లో 11.62) సూర్యనే. అయితే, అక్షర్ స్పిన్ ఆల్ రౌండర్. సూర్య మాత్రం బ్యాటర్.
గంభీర్ ఏం చేస్తాడో..?
సూర్య బ్యాటింగ్ ఆందోళనకరంగా ఉన్న సంగతి ఆస్ట్రేలియా టూర్ కు ముందునుంచే చర్చనీయంగా మారింది. ఆసియా కప్ లో అతడు ఏమాత్రం రాణించలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా మీద కూడా విఫలం అవుతున్నాడు. ఆదివారం నాటి మూడో టి20లో సూర్య బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. రెండు ఫోర్లు కొట్టినా ఆ వెంటనే వికెట్ ఇచ్చేశాడు. దీనిని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తీసుకున్నట్లు కనిపించింది.
కెప్టెన్ గానే కాదు బ్యాటర్ గా అయినా ఉంటాడా?
వచ్చే ఫిబ్రవరిలో మొదలయ్యే టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా కెప్టెన్ గానే కాదు.. కనీసం బ్యాటర్ గా అయినా జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడా? అనేది అనుమానమే. ఓవైపు సంజూశాంసన్, మరోవైపు యశస్వి జైశ్వాల్ ఇద్దరూ జట్టులో చోటు కోసం చూస్తుండగా.. మరోవైపు కెప్టెన్ గిల్ తో పాటు వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు, హెడ్ కోచ్ కఠిన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు.