టి20 వరల్డ్ కప్..రోప్ జరిపారు..ఇండియా గెలిచింది.. రాయుడి రచ్చ
చివరి ఓవర్లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు.;
14 నెలల కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అజేయంగా ఫైనల్ కు చేరిన భారత జట్టు చివరి మెట్టుపై దక్షిణాఫ్రికాను బోల్తా కొట్టి ప్రపంచ కప్ అందుకుంది. అయితే, నాడు హోరాహోరీగా సాగిన మ్యాచ్ అంతా ఒక ఎత్తు... హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ పట్టి అద్భుతమైన క్యాచ్ మరొక ఎత్తు..! వాస్తవంగా చెప్పాలంటే, ఆ క్యాచ్ తోనే మ్యాచ్ భారత్ వశమైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయగా, చేజింగ్ లో 19వ ఓవర్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా 161/6 తో నిలిచింది.
అది ప్రపంచ కప్ క్యాచ్
చివరి ఓవర్లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. హార్దిక్ వైడ్ ఫుల్ టాస్ గా వేసిన తొలి బంతిని అతడు వైడ్ లాంగాఫ్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే, బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. మొదట రోప్ వద్ద క్యాచ్ పట్టిన అతడు.. కాలు రోప్ నకు తాకకుండా బంతిని గాల్లోకి విసిరేశాడు. ఆపై రోప్ ఆవలకు వెళ్లి వచ్చి బంతిని అందుకున్నాడు. ఇది ఫెయిర్ క్యాచ్ అని తేలింది. అంపైర్లు కూడా ఔట్ ఇచ్చారు. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు 161/7 గా మారింది. చివరి 5 బంతుల్లో 8 పరుగులే రావడంతో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ చాంపియన్ అయింది.
రోప్ జరిగిందంటున్న రాయుడు...
టి20 ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్లో సూర్య పట్టిన క్యాచ్ పై ఇప్పటికే అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. కానీ, అది లీగల్ క్యాచ్ అని తేలింది. తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ అంబటి రాయుడు మాత్రం కొత్త పంచాయతీ పెట్టాడు. బ్రేక్ సమయంలో వరల్డ్ ఫీడ్ కామెంటేటర్లు రోప్ ను వెనక్కు నెట్టారని... ఆ తర్వాత దానిని అలాగే వదిలేశారని చెప్పాడు. ఆ కాస్త బౌండరీ రోప్ మార్పే టీమ్ ఇండియాకు పెద్ద వరంగా మారిందంటున్నాడు.
అంతా దేవుడి ప్లాన్...
టి20 ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ సందర్భంగా అంతా దేవుడి ప్లాన్.. ఆ రోజు దేవుడు మనవైపు ఉన్నాడని రాయుడు అభివర్ణించాడు. అయితే, ఎప్పుడో ముగిసిన అంశానికి సంబంధించి రాయుడు ఇప్పుడు గెలకడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ పోయి ఆసియా కప్ కూడా వస్తుండగా నాటి సంచలన క్యాచ్ గురించి ప్రస్తావన ఎందుకనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.