అయ్యయ్యో అయ్యర్.. టీమ్ఇండియా రాబోయే సిరీస్ లకు దూరమేనా?
పొట్టి ఫార్మాట్ లో అయ్యర్ జట్టులో లేడు కాబట్టి ఇప్పటికి సరే.. వచ్చే నెల నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికా టెస్టు, వన్డే సిరీస్, ఆపై న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నాటికి కోలుకుంటాడా?;
అతడు టి20 లీగ్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్.. విధ్వంసక బ్యాటర్.. వన్డేల్లో నిలకడకు మారుపేరు.. టెస్టుల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు... ఇలా త్రీ ఫార్మాట్స్ ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు.. అయితే, అతడికి ప్రతిభ ఎంత ఉందో అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. క్రమశిక్షణ లేదన్న నిందలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ మబ్బులన్నీ తొలగిపోయి వన్డేల్లో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. రేపు టెస్టుల్లోకి, టి20ల్లోకీ పునరాగమనం చేసే చాన్స్ ఉందనగా అనూహ్యంగా ఆస్ట్రేలియాలో పెద్ద గాయానికి గురయ్యాడు. దాని తీవ్రత చూస్తే మళ్లీ ఎప్పుడు బరిలో దిగుతాడు? అనే అనుమానం కలుగుతోంది. టీమ్ ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మొదటి టి20 మ్యాచ్ ఆడనుంది. పొట్టి ఫార్మాట్ లో అయ్యర్ జట్టులో లేడు కాబట్టి ఇప్పటికి సరే.. వచ్చే నెల నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికా టెస్టు, వన్డే సిరీస్, ఆపై న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నాటికి కోలుకుంటాడా?
వైస్ కెప్టెన్ అయిన తొలి టూర్ లోనే..
శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు తొలిసారి వైస్ కెప్టెన్ అయ్యాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. సిడ్నీలో శనివారం జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ కు దిగే అవసరం రాలేదు కాబట్టి సరిపోయింది. వాస్తవానికి అయ్యర్ బ్యాటింగ్ చేసే పరిస్థితులో లేడు. అతడు మైదానంలోనే లేడు. ఆస్పత్రి ఐసీయూలో ఉన్నాడు.
కీలక క్యాచ్ పట్టి..
ఆస్ట్రేలియాతో వన్డేలో కీలక క్యాచ్ అందుకుని కిందపడిన అయ్యర్ ప్లీహానికి గాయమైంది. ఎడమ పక్కటెముకలు నేలకు గట్టిగా ఒత్తుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో సిడ్నీలోనే ఆస్పత్రిలో చేర్చారు. అయ్యర్ పరిస్థితి నిలకడగా ఉందని బీసీసీఐ నుంచి సమాచారం వచ్చింది. త్వరగా కోలుకుంటున్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అయ్యర్ తల్లిదండ్రులు ముంబై నుంచి సిడ్నీ బయల్దేరారు. కానీ, గాయం సున్నితమైనది కావడంతో శ్రేయస్ ఇప్పుడే మైదానంలోకి దిగలేడు.
6 నుంచి 12 వారాలు..
ప్లీహానికి గాయమైన శ్రేయస్ అయ్యర్ 6 నుంచి 12 వారాలు మైదానంలోకి దిగలేడా..? అంటే దీనికి సమాధానం ఔననే చెప్పాలి. కనీసం ఆరు వారాలు అయ్యర్ టీమ్ ఇండియాకు దూరమైనట్లే. గాయం మానాలంటే 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. నెలన్నర నుంచి మూడు నెలలు అన్నమాట. ఈ సమయంలో బాధితుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మళ్లీ గాయమైతే అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. శ్రేయస్ కు తక్షణమే చికిత్స అందడంతో పాటు ఫిట్ నెస్ ఉంటుంది కాబట్టి ఇబ్బందేమీ లేదని భావించవచ్చు. త్వరగానే కోలుకున్నా.. మైదానంలోకి దిగడం మాత్రం రెండు నెలల తర్వాతే అని భావించాలి.