13 బంతుల్లో 11 సిక్సర్లు.. ఈ సారి ఐపీఎల్ లో ఇతడికి కాసుల పంటే
నిన్నటి వరకు భారత క్రికెట్ లో సల్మాన్ నిస్సార్ ఎవరో తెలియదు. ఇప్పుడు మాత్రం ఎవడు భయ్యా వీడు..? ఇంత విధ్వంసకరంగా ఉన్నాడు..? అంటూ సెర్చింగ్ మొదలైంది.;
ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన యువరాజ్ సింగ్ ను చూశాం.. చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సులతో జట్టును గెలిపించిన రింకూ సింగ్ ను చూశాం.. నోబాల్ నూ సిక్స్ గా కొట్టి ఓవర్లో ఏడు సిక్సులు బాదిన రుతురాజ్ గైక్వాడ్ నూ చూశాం..! కానీ, ఇతడు 13 బంతుల్లో 11 సిక్సులు బాదాడు.. 26 బంతుల్లోనే 86 పరుగులు చేసేశాడు.. వచ్చే ఐపీఎల్ సీజన్ వేలానికి తన బెర్తును ఖాయం చేసుకున్నాడు.
ఎవడు భయ్యా వీడు...?
నిన్నటి వరకు భారత క్రికెట్ లో సల్మాన్ నిస్సార్ ఎవరో తెలియదు. ఇప్పుడు మాత్రం ఎవడు భయ్యా వీడు..? ఇంత విధ్వంసకరంగా ఉన్నాడు..? అంటూ సెర్చింగ్ మొదలైంది. ఇంతకూ సల్మాన్ నిస్సార్ ఎవరంటే.. కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్)లో కాలికట్ గ్లోబ్ స్టార్స్ తరఫున ఆడుతున్నవాడు. తిరువనంతపురంలో శనివారం జరిగిన మ్యాచ్ లో త్రివేండ్రం రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సల్మాన్ దుమ్మురేపాడు. అభిజిత్ ప్రవీణ్ వేసిన 20వ ఓవర్లో ఆరు సిక్సులు కొట్టాడు. వైడ్, నోబ్ ద్వారా అదనపు పరుగులు రావడంతో ఈ ఓవర్లో 40 పరుగులు వచ్చాయి.
అంతర్జాతీయ బౌలర్ నూ బాదేశాడు..
బసిల్ థంపి.. కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్. టీమ్ ఇండియాకూ ఆడినవాడు. మంచి వేగం ఉన్న పేసర్. ఇతడినీ సల్మాన్ బాదేశాడు. ఏకంగా ఐదు సిక్సులు కొట్టాడు. మొత్తంమీద ఆడిన చివరి 13 బంతుల్లో 11 సిక్సులు బాదాడు. 18 ఓవర్లకు 115/6 గా ఉన్న కాలికట్ జట్టు.. చివరి రెండు ఓవర్లలో సల్మాన్ చెలరేగడంతో 186 పరుగుల మెరుగైన స్కోరు చేసింది. అంటే, ఆఖరి 12 బంతుల్లో 71 పరుగులు వచ్చాయన్నమాట. ఇక ఐపీఎల్ వేలంలో సల్మాన్ కి ఎంత ధర పలుకుతుంది? అనేది చూడాలి.
గ్రౌండే లాంచ్ ప్యాడ్..
సల్మాన్ బ్యాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు గ్రౌండ్ ను లాంచ్‌ప్యాడ్ చేశాడని అందరూ పొగిడేస్తున్నారు. ప్రపంచ స్థాయి టి20లీగ్‌లలోనూ సాధ్యం కాని బ్యాటింగ్ విన్యాసం ఇదీ అని కొనియాడుతున్నారు. ఇక సల్మాన్ ఒంటిచేతో తన జట్టును గెలిపించాడనే చెప్పాలి. త్రివేండ్రం రాయల్స్ 173 పరుగులకు ఆలౌటైంది. 13 పరుగులతో కాలికట్ నెగ్గింది. అదే సల్మాన్ ఇన్నింగ్స్ లేకుంటే త్రివేండ్రందే పైచేయి అనడంలో సందేహం లేదు.