టీమ్ ఇండియా జెర్సీలో రో-కో 389వ మ్యాచ్..స‌చిన్-ద్ర‌విడ్ త‌ర్వాత వీరే

అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ లో దిగ్గ‌జ బ్యాట్స్ మెన్ ఎవ‌రంటే ప్ర‌స్తుతం ఠ‌క్కున జ‌వాబు చెప్ప‌గ‌ల పేర్లు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి-రోహిత్ శ‌ర్మ‌.;

Update: 2025-10-18 13:30 GMT

అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ లో దిగ్గ‌జ బ్యాట్స్ మెన్ ఎవ‌రంటే ప్ర‌స్తుతం ఠ‌క్కున జ‌వాబు చెప్ప‌గ‌ల పేర్లు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి-రోహిత్ శ‌ర్మ‌. వ‌న్డేల్లో ప‌దివేల‌కు పైగా ప‌రుగులు సాధించి ఇప్ప‌టికీ కెరీర్ లో కొన‌సాగుతున్నది ఇద్ద‌రే ఇద్ద‌రు బ్యాట‌ర్లు. ఆ ఇద్ద‌రూ వీరే. దీన్నిబ‌ట్టే రోహిత్-కోహ్లిల స్థాయి ఏమిటో తెలుస్తోంది. ఇక నిరుడు టి20 అంత‌ర్జాతీయ క్రికెట్ కు,ఈ ఏడాది టెస్టుల‌కు ఒకేసారి గుడ్ బై చెప్పిన ఈ జోడీ.. ఇప్పుడు వ‌న్డేల్లోనే కొన‌సాగుతోంది. అది కూడా ఎన్నిరోజులో చెప్ప‌లేం...?

అగార్క‌ర్ మాట‌ల‌ను బ‌ట్టి...

శుక్ర‌వారం టీమ్ ఇండియా చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ మాట్లాడిన తీరును బ‌ట్టి రోహిత్, కోహ్లిలు ఆస్ట్రేలియా టూర్ లో మూడు మ్యాచ్ ల‌లో సెంచ‌రీలు చేసినా 2027 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తార‌ని గ్యారంటీ లేదు. ఇదే విష‌యం గ‌త వారం హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సైతం స్ప‌ష్టం చేశాడు. ఇలాంటి స‌మ‌యంలో ఆదివారం ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేలో లో రో-కో ఇద్ద‌రూ క‌లిసి ఆడ‌నున్నారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ త‌ర్వాత వీరు టీమ్ ఇండియా జెర్సీలో క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. అంటే, దాదాపు 7 నెల‌ల త‌ర్వాత రో-కో జంట‌గా ఆడుతున్నారు.

ఈ రికార్డు బ‌ద్ద‌లు ఖాయ‌మే..

టీమ్ ఇండియా త‌ర‌ఫున టెస్టులు, వ‌న్డేలు, టి20లు మూడు ఫార్మాట్లలోనూ ఇప్ప‌టివ‌ర‌కు రోహిత్-కోహ్లి 388 సార్లు బ‌రిలో దిగారు. ఆదివారం వ‌న్డేతో 389వ సారి ఆడ‌నున్నారు. మ‌రో రెండు మ్యాచ్ లు కూడా ఉన్నందున క‌లిసి 391 మ్యాచ్ లు ఆడిన‌ట్లు అవుతుంది. కాగా, టీమ్ ఇండియా మాజీ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్-రాహుల్ ద్ర‌విడ్ లు అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు 391 సార్లు క‌లిసి బ‌రిలో దిగారు. ఈ రికార్డు అస‌లు చెరిపేది కాదు అనుకుంటే.. రో-కో అధిగ‌మించేలా క‌నిపిస్తున్నారు.

400 ఆడేస్తారా?

ఏ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌యినా క‌లిసి 400 మ్యాచ్ లు ఆడ‌డం చాలా గొప్ప విష‌యం. దాదాపు అసాధ్యం కూడా. కానీ, రోహిత్-కోహ్లి దానిని అందుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో 391 మ్యాచ్ లు పూర్తి చేసుకునే వీరు.. స‌చిన్-ద్ర‌విడ్ ను ఈక్వ‌ల్ చేస్తారు. ఆపై వ‌చ్చే నెల‌లో ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేలు ఆడాల్సి ఉంది. ఆపై న్యూజిలాండ్ ఇంగ్లండ్ తోనూ మూడేసి వ‌న్డేల సిరీస్ ఉంది. ఈ ప్ర‌కారం చూస్తే.. రోహిత్-కోహ్లి క‌లిసి 400 మ్యాచ్ లు ఆడిన రికార్డును అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

కొస‌మెరుపుః ఆస్ట్రేలియా సిరీస్ లో రాణించ‌కుంటే రోహిత్ -కోహ్లిల‌ను త‌దుప‌రి సిరీస్ ల‌కు ఎంపిక చేయ‌డం క‌ష్ట‌మే. ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంపిక చేయ‌కున్నా.. వీరి రికార్డు స‌చిన్-ద్ర‌విడ్ రికార్డు వ‌ద్ద‌నే ఆగిపోయే చాన్సుంది.

Tags:    

Similar News