అమ్మకానికి ఐపీఎల్ చాంపియన్.. కొనేస్తానంటున్న అపర కుబేరుడు
కానీ, పాత ఓనర్షిప్ లో కాదు.. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో..! అంతా అనుకున్నట్లు జరిగితే ఓ అపర కుబేరుడు ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోనున్నారు.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పది జట్లు ఉండొచ్చు.. వాటిలో కొన్ని పలుసార్లు చాంపియన్లు అయి ఉండొచ్చు.. మరికొన్ని అసలు టైటిలే కొట్టకపోయి ఉండొచ్చు.. కానీ, కొన్ని జట్లకు మాత్రం ఉన్నంత ఫ్యాన్ బేస్ అతి భారీ. ఇలాంటి జట్లలో ఒకటి గత ఏడాది చాంపియన్ గా నిలిచింది. 18వ సీజన్ తర్వాత టైటిల్ కల నెరవేర్చుకుంది. ఇప్పుడు ఆ జట్టు చాంపియన్ హోదాలో తొలిసారిగా ఐపీఎల్ సీజన్ లో అడుగుపెట్టబోతోంది. కానీ, పాత ఓనర్షిప్ లో కాదు.. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో..! అంతా అనుకున్నట్లు జరిగితే ఓ అపర కుబేరుడు ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోనున్నారు.
ఎవరు కొనేది? ఎంతకు కొనేది?
సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఈ పేరు కొవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో అందరికీ తెలిసింది. దీని సీఈవో అథర్ పూనావాలా. ఒకదశలో అథర్.. కొవిడ్ వ్యాక్సిన్ డిమాండ్ ను తట్టుకోలేక బ్రిటన్ వెళ్లిపోయినట్లుగానూ కథనాలు వచ్చాయి. దీనిపై రాజకీయ విమర్శలు కూడా చెలరేగాయి. అలాంటి అథర్... తాజాగా తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు బిడ్ వేస్తానని ప్రకటించారు. రూ.వేలాది కోట్ల ఆస్తిపరుడైన అథర్.. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇక ఆర్సీబీ విలువ ఎంత అనేది చూస్తే... 2 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.18 వేల కోట్లకు పైమాటే అన్నమాట. గత సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ ఇప్పుడు చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. దీని యాజమాన్యం డియోజియో. ఇప్పటికే విక్రయ ప్రక్రియను ప్రారంభించింది.
పాత యాజమన్యంతో మొదలై.. కొత్త చేతుల్లోకి
వచ్చే ఐపీఎల్ సీజన్ మార్చి 26న మొదలుకానుంది. మార్చి 31నాటికి ఆర్సీబీ విక్రయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అంటే, డిఫెండింగ్ చాంపియన్ పాత యాజమాన్యం చేతుల్లో సీజన్ ను మొదలుపెట్టి, కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. సీరమ్ తో పాటు చాలా విదేశీ కంపెనీలు ఆర్సీబీని సొంతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. తాము బలమైన బిడ్ వేస్తామని అథర్ పూనావాలా ప్రకటించారు. అంటే, ఆయన గట్టి పోటీనే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) అధినేత విజయ్ మాల్యా ఆర్సీబీనీ సొంతం చేసుకున్నారు. అనంతరం ఆయన సంస్థ దివాలా తీయడంతో తమ అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా ఆర్సీబీని డియోజియో కొనుగోలు చేసింది.
-ఐపీఎల్ లో డిఫెండింగ్ చాంపియన్ గా ఉంటూ యాజమాన్యం మారిన ఫ్రాంచైజీలు దాదాపు లేవు. ఇప్పుడు ఆర్సీబీ ఆ ప్రత్యేకతను సొంతం చేసుకోనుంది. మరోవైపు సూపర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ తో ఈసారి లీగ్ లో అడుగుపెడుతున్నాడు. దీంతో మరింత క్రేజీగా మారింది.