ఆర్సీబీ రీఎంట్రీ.. 3 నెలల తర్వాత ఐపీఎల్ చాంపియన్ కు మాటొచ్చింది...
కానీ, సొంత నగరం బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం బయట జూన్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. దేశవ్యాప్తంగానూ ఈ ఘటన సంచలనంగా మారింది.;
17 ఏళ్లు.. 18 సీజన్లు.. ఎట్టకేలకు టైటిల్ గెలిచినందుకు సంతోష పడాలో..? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజేత అన్న ట్యాగ్ కు గర్వ పడాలో..? చాంపియన్ గా నిలిచిన గంటల్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి పరోక్షంగా కారణమైనందుకు బాధపడాలో తెలియని పరిస్థితి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ది. ఎందరో గొప్ప క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించినా.. టైటిల్ మాత్రం కొట్టలేక పోయిన ఆ జట్టు కల ఈ ఏడాది నెరవేరింది. కానీ, సొంత నగరం బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం బయట జూన్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. దేశవ్యాప్తంగానూ ఈ ఘటన సంచలనంగా మారింది.
అప్పటినుంచి మౌన వ్రతం..
ఆర్సీబీ సోషల్ మీడియా ఖాతా చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తమ అప్ డేట్ లను పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా లీగ్ సందర్భంగా ఆసక్తికర పోస్టులు పెడుతుంది. కానీ, బెంగళూరు తొక్కిసలాట తర్వాత దాని ఎక్స్ ఖాతా మూగబోయింది. మరీ ముఖ్యంగా తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీ ఫ్రాంచైజీనే అన్న ఆరోపణలు రావడంతో ఎక్స్ లో పోస్ట్ లు పెట్టడం మానేసింది. తాజాగా గురువారం ఎక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
మౌనం ఆబ్సెన్స్ కాదు...
మా మౌనం ఆబ్సెన్స్ కాదు.. బాధ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. జూన్ 4 జరిగిన దానితో మా గుండె బద్దలైంది. ఆ దుర్ఘటనతో అంతా మారిపోయింది. ఆర్సీబీ కేర్స్ కు ప్రాణం పోసేలా చేసింది. ఈ నిధితో అభిమానులకు అండగా నిలుస్తాం. మేం తిరిగొచ్చింది సెలబ్రేషన్స్ తో కాదు.. మీతో కలిసి నడవడానికి అంటూ పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చెప్పింది. దీనిప్రకారం చూస్తే... ఆర్సీబీ మరో నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా? అని అభిమానులు ఆశిస్తున్నారు.
భారీగా ఫాలోవర్లు...
సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. అన్ని మీడియాల్లో కలిపి 35.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అటు ఆర్సీబీకి క్రేజ్ కూడా ఎక్కువే. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ జట్టును ఆరాధిస్తుంటారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాలో @rcbtweets ఖాతాను ఫాలో అవుతుంటారు. మరి మున్ముందు ఆ ఫ్రాంచైజీ ఏం చెబుతుందో చూద్దాం..