అండ‌ర్19 క్రికెట్ జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేద‌ని..కోచ్ ను చిత‌క్కొట్టారు

భార‌తదేశంలో క్రికెట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలిసిందే..! క‌నీసం అండ‌ర్ 12 స్థాయిలో పోటీలు నిర్వ‌హించినా వేలాదిమంది పోటీ ప‌డే ప‌రిస్థితి.;

Update: 2025-12-10 11:13 GMT

భార‌తదేశంలో క్రికెట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలిసిందే..! క‌నీసం అండ‌ర్ 12 స్థాయిలో పోటీలు నిర్వ‌హించినా వేలాదిమంది పోటీ ప‌డే ప‌రిస్థితి. ఇక ఏజ్ గ్రూప్ లో ఒక్కో ద‌శ‌ను దాటి పైకి వెళ్లాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో కొంత ల‌క్ కూడా క‌లిసిరావాల్సి ఉంటుంది. అందుక‌నే టీమ్ ఇండియాలో చోటు ల‌క్ష్యంగా పెట్టుకున్న కుర్రాళ్లు విప‌రీతంగా శ్ర‌మిస్తుంటారు. త‌మ కెరీర్ ను ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ వ‌స్తారు. ఇక గుర్తింపు పొందిన ఏ జ‌ట్టులో అయినా చోటు ద‌క్కిందంటే త‌మ క‌ల సాకారం అయిన‌ట్లే భావిస్తుంటారు. అయితే, ఇలా జ‌ట్టులో చోటు ల‌భించ‌లేద‌ని కొంద‌రు ఆట‌గాళ్లు తీవ్రంగా స్పందించారు. ఏకంగా కోచ్ నే చిత‌క్కొట్టారు. ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అవ‌డంతో పాటు ఆ కుర్రాళ్ల‌పై పోలీసు కేసు న‌మోదైంది. ఇక ఆ టోర్నీ కూడా పేరున్న‌దే కావ‌డంతో ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయం కావ‌డం ఖాయం అని తెలుస్తోంది.

ముస్తాక్ అలీకి ఎంపిక చేయ‌లేద‌ని ముష్ఠిఘాతాలు

దేశంలో పేరున్న క్రికెట్ సంఘం కూడా కాదు పుదుచ్చేరి క్రికెట్ అసోసియేష‌న్ (సీఏపీ). చిన్న రాష్ట్రం కావ‌డంతో ఇక్క‌డ నుంచి పెద్ద క్రీడాకారులు కూడా రావ‌డం లేదు. ఇక‌ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నీ (స్మాట్) అనేది భారత క్రికెట్ లో పేరున్న టోర్నీ. దీనిని టి20 ఫార్మాట్ లో నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌తిభ చాటిన‌వారికి దేశంలో పేరు కూడా వ‌స్తుంది. ఇలాంటి టోర్నీకి ఎంపిక చేయ‌లేద‌ని పుదుచ్చేరి అసోసియేష‌న్ కు చెందిన అండ‌ర్ 19 కోచ్ పై ముగ్గురు కుర్రాళ్లు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.

అవ‌కాశం ఇచ్చేది సెల‌క్ట‌ర్లు..

జ‌ట్టులోకి ఎంపిక చేసేది సెల‌క్ట‌ర్లు. కేవ‌లం కోచ్ అభిప్రాయం తీసుకుంటారు అంతే. అయితే త‌మ‌ను ఎంపిక చేయ‌లేదంటూ సీఏపీ అండ‌ర్ 19 హెడ్ కోచ్ ఎస్. వెంక‌ట ర‌మ‌ణ్ పై ముగ్గురు పుదుచ్చేరి క్రికెట‌ర్లు దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో కోచ్ త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఫోర్ హెడ్ పై 20 కుట్లు ప‌డ్డాయి. భుజం విరిగింది. దీంతో ఆట‌గాళ్ల‌పై కేసు న‌మోదైంది.

ప‌రారీలో కుర్రాళ్లు..

అండ‌ర్ 19 జ‌ట్టుకు అంటే వారింకా కుర్రాళ్లే అయి ఉంటారు. కోచ్ పై దాడి త‌ర్వాత వారు ప‌రారైన‌ట్లు స‌మాచారం. కోచ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. త‌న‌ను చంపే ఉద్దేశంతోనే దాడి చేశార‌ని కోచ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న ఈ నెల 8న జ‌రిగింది. సోమ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోచ్ ఫిర్యాదు మేర‌కు అత‌డిపై దాడి చేసింది కార్తికేయ‌న్, అర‌వింద‌రాజ్, సంతోష్ కుమారన్ గా తెలిసింది. ఏది ఏమైనా.. విచ‌క్ష‌ణ కోల్పోయి కోచ్ పై దాడికి దిగి ముగ్గురు కుర్రాళ్లు కెరీర్ దెబ్బ‌తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News