రిఫరీ సారీ.. మాటలు మ్యూట్! అంపైర్ టార్గెట్.. ఇదీ పాక్ జట్టు తీరు
తాజాగా పాక్ టీమ్ మేనేజ్ మెంట్ తో పైక్రాఫ్ట్ సమావేశం వీడియోను పాక్ బోర్డు విడుదల చేసింది. కానీ, అది మ్యూట్ లో ఉండడం గమనార్హం.;
ఆసియా కప్ లో పాకిస్థాన్ జట్టు తీరు అంతకంతకు వివాదాస్పదం అవుతోంది. మాటలతో రిఫరీపై.. బంతితో అంపైర్ పై ఆ జట్టు దాడి చేసినట్లు పైకి కనిపిస్తోంది. భారత ఆటగాళ్లతో కరచాలనం విషయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరును తప్పుబడుతున్న పాక్... బుధవారం యూఏఈతో మ్యాచ్ కు ముందు ఆయనను తొలగించాలని పట్టుబట్టింది. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తోక ముడిచింది. యూఏఈతో మ్యాచ్ లో ఆడకుంటే ఆసియా కప్ నుంచి ఔట్ అయ్యే పరిస్థితుల్లో చివరకు మెట్టుదిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో పైక్రాఫ్ట్ సారీ చెప్పాడని, అందుకే తాము మెత్తబడ్డామని పాక్ టీమ్ మేనేజ్ మెంట్ సర్దిచెప్పుకొంటోంది.
ఐసీసీ ప్రతినిధి ఏం చెప్పాడంటే..?
గత ఆదివారం మ్యాచ్ లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై సోమవారం రిఫరీ పైక్రాఫ్ట్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. క్రికెట్ నియమావళి ఉల్లంఘనకు పైక్రాఫ్ట్ కారణం అంటూ అతడిని ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ, ఐసీసీ రివ్యూలో పైక్రాఫ్ట్ తప్పు ఏమీ లేదని తేల్చింది. ఈ విషయం చెప్పినా.. అతడిని మాత్రం రిఫరీగా కొనసాగించవద్దని పాక్ కోరింది. ఇది సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. చివరకు పైక్రాఫ్ట్ తమకు ‘సారీ’ చెప్పాడని అందుకని తాము మ్యాచ్ ఆడామని పాక్ చెప్పుకొచ్చింది. మరోవైపు పాక్ కెప్టెన్, టీమ్ మేనేజర్, ప్రధాన కోచ్ లతో పైక్రాఫ్ట్ కోరిక మేరకు ఐసీసీ సమావేశం ఏర్పాటు చేసింది. మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఇలా జరిగిందని, కోడ్ ఆఫ్ కండక్ట్ ను మాత్రం ఉల్లంఘించలేదని తెలిపాడు.
మాటలు లేని వీడియోతో...
తాజాగా పాక్ టీమ్ మేనేజ్ మెంట్ తో పైక్రాఫ్ట్ సమావేశం వీడియోను పాక్ బోర్డు విడుదల చేసింది. కానీ, అది మ్యూట్ లో ఉండడం గమనార్హం. దీనిని చూసే అభిమానులు సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. కాగా కడుపు మంట చల్లారని పాక్... ఈ నెల 17న ఐసీసీ మరో మెయిల్ పెట్టింది. నిబంధనల అతిక్రమణపై విచారణ చేయించాలని, ఆధారాలను ఇవ్వాలని ఐసీసీ కోరింది. వాటిని పరిశీలించే పనిలో ఉంది.
రుచిర నిర్ణయాలు రుచించలేదా?
శ్రీలంకకు చెందిన అంపైర్ రుచిర పెరీరాపై పాక్ జట్టుకు ఎప్పటినుంచో కడుపు మంట ఉంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ రుచిర నిర్ణయాలు పాక్ కు రుచించలేదు. బుధవారం నాటి మ్యాచ్ లో పాకిస్థాన్ వికెట్ కీపర్ హారిస్ విసిరన బంతి తగిలాక కామెంట్రీలో ఉన్న వసీం అక్రమ్ బుల్స్ ఐ అంటూ వ్యాఖ్యానించాడు. 9 ఏళ్ల కిందట కూడా ఇలానే రుచిరాపై అప్పటి వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ బంతిని విసిరాడు. దీన్నిబట్టి అతడు ఎప్పటినుంచో టార్గెట్ అయ్యాడని స్పష్టం అవుతోంది.