అతడు అజేయుడు.. ఐపీఎల్ లో ఔట్ చేసే బౌలరే లేడా?

‘నాటౌట్’.. క్రికెట్ లో సెంచరీకి ఎంత విలువ ఉందో..? కొన్ని సందర్భాల్లో నాటౌట్ కూ అంతే విలువ ఉంటుంది.

Update: 2024-04-29 14:30 GMT

‘నాటౌట్’.. క్రికెట్ లో సెంచరీకి ఎంత విలువ ఉందో..? కొన్ని సందర్భాల్లో నాటౌట్ కూ అంతే విలువ ఉంటుంది. బాక్సింగ్ లో ప్రత్యర్థిని నాకౌట్ చేస్తే ఎంత గొప్పనో క్రికెట్ లో అజేయంగా నిలిస్తే అంత ప్రత్యేకత. అయితే, చాలా సందర్భాల్లో విలువైన ఇన్నింగ్స్ లు ఆడి, లేదా హోరాహోరీగా పోరాడి బ్యాట్స్ మెన్ అజేయంగా నిలుస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం ఓ బ్యాటర్ క్రీజులోకి దిగిన ఏడు మ్యాచ్ ల్లోనూ నాటౌట్ గా మిగిలాడు. నన్ను ఔట్ చేసే బౌలరే లేడా? అనే సవాల్ విసురుతున్నాడు.

ఐపీఎల్ లో ఇదో రికార్డు

9 మ్యాచ్ ల్లో 7 నాటౌట్ లు.. 2 మ్యాచ్ ల్లో బ్యాటింగ్ రాలేదు. మొత్తమ్మీద ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ ప్రత్యర్థి బౌలర్ కు వికెట్టే ఇవ్వలేదు. ఇదీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఘనత. అంటే.. ఈసారి లీగ్ లో అతడు ఔటే కాలేదన్నమాట. మార్చి 22న బెంగళూరుతో తొలి మ్యాచ్ లో, మార్చి 26న గుజరాత్ తో మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు దిగలేదు. ఈ తర్వాత ఈ ఆదివారం వరకు ఏడు మ్యాచ్ లలో అసలు ఔటే కాలేదు. 37, 1, 1, 20, 28, 4, 5.. ఇవీ అతడి స్కోర్లు.

Read more!

మళ్లీ మెరుపులు.. మ్యాచ్ విన్నింగ్ లు

ధోనీ సహజంగా ఏడో నంబరులో బ్యాటింగ్ కు రావడాన్ని ఇష్టపడతాడు. అది అతడికి లక్కీ నంబరు కూడా. కాగా, ఈ ఐపీఎల్ లోనూ ఇటుఅటుగా అదే నంబరులో దిగుతున్నాడు. అప్పటికి తక్కువ బంతులే ఉంటున్నాయి. దీంతోపాటు ధోనీ అంటే మ్యాచ్ విన్నర్. ఫినిషర్. ముంబైతో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో మూడు సిక్స్ లతో ధోనీ చేసిన 20 పరుగులే ఫలితాన్ని నిర్దేశించాయి. లక్నోతోనూ 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 28 పరుగులు బాదాడు. ఇక విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ధోనీ 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్ లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు విశాఖ వైఎస్ఆర్ స్టేడియం దద్దరిల్లింది. ఇక మహి చివర్లో క్రీజులోకి వస్తుండగా అభిమానుల అరుపులతో స్టేడియంలో శబ్ద పరిమితి దాటిపోతోంది. లక్నోతో మ్యాచ్ లో స్టేడియం మొత్తం రీసౌండ్ వచ్చింది. 10 నిమిషాల పాటు ఫ్యాన్స్ అరుపులు కేకలు తప్ప ఇంకేమీ వినిపించలేదు. స్టేడియంలోనే ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ భార్య సాషా.. తన స్మార్ట్ వాచ్ ద్వారా ఈ సౌండ్ లెవెల్స్‌ రికార్డు చేశారు. ధోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పుడు వచ్చిన సౌండ్ తీవ్రత 92 డెసిబల్స్‌గా నమోదయింది. దీంతో తాత్కాలికంగా చెవుడుకు కారణమవుతోంది అంటూ డికాక్ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం.

Tags:    

Similar News