ఇక మ‌న‌ హైద‌రాబాదీనే భార‌త పేస్ ద‌ళ‌ప‌తి.. భ‌విష్య‌త్ కెప్టెన్ కూడా!

ఏమాత్రం ఆశ‌లు లేని స్థితి నుంచి జ‌ట్టును గెలిపించిన తీరు అమోఘం.. దీంతో ప్ర‌స్తుతం నేష‌న‌ల్ హీరో అయిపోయాడు...! అత‌డే మ‌న హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్.;

Update: 2025-08-06 07:24 GMT

ఐదుకు ఐదు టెస్టులు... 185.3 ఓవ‌ర్లు... 1113 బంతులు... 23 వికెట్లు..! అల‌స‌టే లేదు.. గాయం మాట అన్న‌దే లేదు.. సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే రెండింట్లోనూ అత‌డి పాత్ర కీల‌కం.. చివ‌రి మ్యాచ్ లో అయితే ఒక ప్ర‌త్య‌ర్థికి చుక్కలు చూపాడు.. ఏమాత్రం ఆశ‌లు లేని స్థితి నుంచి జ‌ట్టును గెలిపించిన తీరు అమోఘం.. దీంతో ప్ర‌స్తుతం నేష‌న‌ల్ హీరో అయిపోయాడు...! అత‌డే మ‌న హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్.

గాయం ఎరుగుని పేసు గుర్రం

మొహ‌మ్మ‌ద్ ష‌మీకి గాయాల బెడ‌ద ఉంది.. వ‌య‌సు కూడా 35. మ‌ళ్లీ అత‌డు జాతీయ జ‌ట్టుకు ఆడ‌డం క‌ష్ట‌మే.. జ‌స్ప్రీత్ బుమ్రాకు గాయాల స‌మ‌స్య మ‌రింత‌ తీవ్రం.. ప్ర‌స్తుత ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో మూడు టెస్టులు ఆడ‌డ‌మే గ‌గ‌న‌మైంది. కొత్త కుర్రాళ్లు ప్ర‌సిద్ధ్ క్రిష్ణ‌, ఆకాశ్ దీప్ ఇంకా కుదురుకోలేదు.. ! కానీ, ఒకే ఒక్క‌డు అన్న‌ట్లు సిరాజ్ చెల‌రేగిపోతున్నాడు. ఏమాత్రం అలుపుసొలుపు లేకుండా బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్ మెన్ చిత‌క‌బాదుతున్నా.. త‌న‌దైన స‌మ‌యం కోసం ఎదురుచూసి వికెట్లు తీస్తున్నాడు. గ‌త 10 నెల‌ల కాలంలో అత‌డు ఎక్క‌డా విశ్రాంతి తీసుకున్న‌దే లేదు. ఐపీఎల్ స‌హా..!

బుమ్రా లేకుంటేనే సిరాజ్ బ‌జ్‌

జ‌ట్టులో ఉంటే భార‌త ప్ర‌ధాన‌ పేస్ బౌల‌ర్ బుమ్రానే. కానీ, ఇక‌మీద‌ట సిరాజ్ త‌ర్వాతే బుమ్రా. 41 టెస్టులు ఆడిన 123 వికెట్లు తీశాడు. 25 మ్యాచ్ ల‌లో బుమ్రాతో క‌లిసి బౌలింగ్ చేస్తే 74 వికెట్లు తీశాడు. బుమ్రా లేకుండా ఆడిన 16 టెస్టుల్లో 49 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్ లో టీమ్ఇండియా గెలిచిన ఎడ్జ్‌బాస్టన్‌, ఓవ‌ల్ టెస్టుల్లో బుమ్రా లేడు. ఈ రెండు టెస్టుల్లో సిరాజ్ 16 వికెట్లు తీశాడు. అందుకే.. బుమ్రా అందుబాటులోకి వ‌చ్చినా ఇక‌మీద‌ట సిరాజే భార‌త ప్ర‌ధాన పేస‌ర్ అని ప్ర‌ఖ్యాత క్రికెట‌ర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

బుమ్రా కంటే బెట‌ర్...

జ‌స్ప్రీత్ బుమ్రా త్వ‌ర‌లో టెస్టు క్రికెట్ వీడ్కోలు ప‌లుకుతాడ‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే నిజ‌మైతే సిరాజ్ ది ప్ర‌ధాన పాత్ర అవుతుంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్ ల‌లో సిరాజ్ అద‌ర‌గొట్టాడు. వీటిలో చాలాసార్లు బుమ్రా అందుబాటులో లేడు. ఇంగ్లండ్ పై ఓవ‌ల్ టెస్టులో బుమ్రా లేకున్నా.. జ‌ట్టును గెలిపించడంతో సిరాజ్ స్థాయి మ‌రింత పెరిగింది. దీంతోనే బుమ్రా వ‌ర్సెస్ సిరాజ్ అనే ఆరోగ్య‌క‌ర‌ చ‌ర్చ న‌డుస్తోంది. బుమ్రా అత్యంత ప్ర‌తిభావంతుడైన బౌల‌ర్ అయిన‌ప్ప‌టికీ... ఫిట్ నెస్, ఫామ్ రీత్యా సిరాజ్ కే కాస్త ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన బుమ్రా.. జాతీయ జ‌ట్టుకు కొన్ని మ్యాచ్ ల‌కే అందుబాటులో ఉన్నాడు. సిరాజ్ మాత్రం ఐపీఎల్ ఆడినా.. అనుభ‌వం లేని కుర్రాళ్ల‌తో పేస్ ద‌ళాన్ని న‌డిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఓవ‌ల్ టెస్టులో అత‌డి అంకిత‌భావం, పోరాట ప‌టిమ అభిమానులను *స‌లామ్ డీఎస్పీ సాబ్* అనిపించింది.

31 ఏళ్ల సిరాజ్ ప్ర‌స్తుతం ప్ర‌ధాన బౌల‌ర్.. భ‌విష్య‌త్ లో శుబ్ మ‌న్ గిల్, రిష‌భ్‌ పంత్ అందుబాటులో లేకుంటే కెప్టెన్ అయ్యే చాన్సుంది. ఏమో.. దేన్నీ కాద‌న‌లేం.. 2015 వ‌ర‌కు క్రికెట్ బంతితో ప్రాక్టీస్ చేయ‌ని, సాధార‌ణ ఆటో డ్రైవ‌ర్ కుమారుడు అయిన సిరాజ్ ఇక్క‌డి వ‌ర‌కు రాలేదా? ఒక‌వేళ అత‌డు టీమ్ఇండియా కెప్టెన్ అయితే.. అజ‌హరుద్దీన్ త‌ర్వాత టీమ్ ఇండియాకు మ‌రో హైద‌రాబాదీ ఆట‌గాడు కెప్టెన్ అయిన రికార్డు ద‌క్కుతుంది.

Tags:    

Similar News