వహ్వా సిరాజ్...ఇంగ్లండ్ పై టీమ్ఇండియా సంచలనం.. 2-2తో సిరీస్ సమం
నాలుగో టెస్టును టీమ్ఇండియా వీరోచితంగా ఆడి డ్రా చేసింది. ఆఖరిదైన ఐదో టెస్టును భారత్ అద్బుత రీతిలో సోమవారం తమ వశం చేసుకుంది.;
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి అదిరిపోయే ముగింపు... కుర్ర కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు తొలి సిరీస్ లోనే సూపర్ ఫలితం.. అతడి సారథ్యంలోని టీమ్ ఇండియా... ఇంగ్లండ్ ను దాని సొంతగడ్డపైనే నిలువరించింది... ఐదు టెస్టుల సిరీస్ ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్ లో తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా, రెండో మ్యాచ్ లో భారత్ నెగ్గింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ దే పైచేయి అయింది. నాలుగో టెస్టును టీమ్ ఇండియా వీరోచితంగా ఆడి డ్రా చేసింది. ఆఖరిదైన ఐదో టెస్టును భారత్ అద్బుత రీతిలో సోమవారం తమ వశం చేసుకుంది.
కేవలం 35 పరుగులే.. అయినా బెదరలే..
టార్గెట్ 374కు గాను 339/6.. అంటే చేయాల్సింది ఇంకా 35 పరుగులే. సోమవారం ఇంగ్లండ్ పరిస్థితి ఇది. కానీ, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. సిరాజ్ (5/104) దెబ్బకు ఇంగ్లండ్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 367 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లోనూ అద్భుతం (4/86)గా బంతులేసిన సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. వాస్తవానికి సోమవారం మ్యాచ్ ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్ లో రెండు బౌండరీలతో మొదలైంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా గెలుపు కష్టమే అనిపించింది. కానీ, సిరాజ్ జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), అట్కిన్సన్ (17)లను ఔట్ చేసి జట్టుకు అద్భుత విజయం కట్టబెట్టాడు. అంతకుముందు జోష్ టంగ్ (0)ను ప్రసిద్ధ్ బౌల్డ్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 224, ఇంగ్లండ్ 247 పరుగుల చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 396 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 367కు ఆలౌటైంది.
తేడా సిరాజ్...
ఐదు టెస్టులు ఐదో రోజు వరకు సాగిన ఈ సిరీస్ లో రెండు జట్ల మధ్య తేడా హైదరాబాదీ సిరాజ్ అనడంలో సందేహం లేదు. ఐదో టెస్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బంతులేశాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ అంతే అద్బుతంగా బౌలింగ్ చేశాడు. చివరకు టీమ్ఇండియాను గెలిపించాడు. ఐదు టెస్టులు ఆడిన సిరాజ్ అందరి కంటే అత్యధికంగా 23 వికెట్లు తీశాడు.
భారత్ తరపున... 754 పరుగులు చేసిన టీమ్ఇండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.