2025.. ఐపీఎల్ కు శాపం.. 2026లో అంతా శుభములేనా?
కాగా, ఈ ఏడాది 18వ సీజన్ లో మాత్రం లీగ్ ఆర్థికంగానూ ఒడిదొడుకులను ఎదుర్కొంది. దీంతో 18వ సీజన్ లీగ్ చరిత్రలోనే అత్యంత కఠినమైనదిగా నిలిచింది.;
సహజంగా కొత్త ఏడాది ప్రారంభమయ్యే సమయంలో జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉన్నవారు తమ జాతక ఫలాలు చూసుకుంటారు. ఆదాయం, ఖర్చు, రాజ్యపూజ్యం, అవమానం.. సరిచూసుకుంటారు..! ఇదే సూత్రాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వర్తింపజేస్తే..!? 18వ సీజన్.. (1+8=9), 2025వ సంవత్సరం (2+0+2+5=9).. ఇలా అన్ని అంకెలు కలిసివచ్చినా, లీగ్ విషయంలో మాత్రం చాలా విషయాలు సానుకూలంగా జరగలేదు. మెగా వేలంలో రూ.కోట్లకు కోట్లు పోసి రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు విఫలం కావడం, పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ తో లీగ్ మధ్యలో ఎన్నడూ లేని విధంగా ఆగిపోవడం, చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచినా విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం వంటివన్నీ తీవ్ర సంచలనంగా మారాయి. ఇక కొత్త సీజన్ కు వచ్చే మంగళవారం నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. ఇందులో భాగంగా అబుదాబిలో మినీ వేలం నిర్వహించనున్నారు. 350 మంది పైగా ఆటగాళ్లతో బీసీసీఐ.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు జాబితా ఇచ్చింది. ఇందులోనుంచి మినీ వేలంలో ఎవరికి ఎక్కువ ధర పలుకుతుందో అనేది ఆసక్తిగా మారింది.
బ్రాండ్ వ్యాల్యూ పతనం
2008లో ఐపీఎల్ మొదలుకాగా ఎన్నడూ వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అన్ని విషయాల్లోనూ ఐపీఎల్ యావత్ క్రికెట్ నే మార్చిందని కూడా చెప్పవచ్చు. ఫ్రాంచైజీలను బ్రాండ్లుగా, ఆటగాళ్లను స్టార్లుగా చేసింది.
కాగా, ఈ ఏడాది 18వ సీజన్ లో మాత్రం లీగ్ ఆర్థికంగానూ ఒడిదొడుకులను ఎదుర్కొంది. దీంతో 18వ సీజన్ లీగ్ చరిత్రలోనే అత్యంత కఠినమైనదిగా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ 9.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది నిరుటి కంటే 20 శాతం తగ్గుదల కావడం గమనార్హం.
ఫ్రాంచైజీలకు లాస్...
ఆపరేషన్ సిందూర్ తో లీగ్ ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది చరిత్రలో తొలిసారి. కాగా, ఫ్రాంచైజీలకూ భారీ నష్టం వచ్చింది. మాజీ చాంపిజయన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వ్యాల్యూ 24 శాతం, రాజస్థాన్ రాయల్స్ 35 శాతం, సన్ రైజర్స్ హైదరాబాద్ 34 శాతం, కోల్ కతా నైట్ రైడర్స్ 33 శాతం పతనమైంది. కేవలం ఒక్క ఫ్రాంచైజీ మాత్రమే.. గుజరాత్ టైటాన్స్ వ్యాల్యూ 2 శాతం పెరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ వ్యాల్యూ క్షీణత 10 శాతం వద్ద ఆగిపోయింది. దీనికి కారణం.. ఆ జట్టు చాంపియన్ గా నిలవడమే.
ఆన్ లైన్ గేమింగ్ యాప్ ల నిషేధంతో..
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో అడ్వర్టయిజ్ మెంట్ల డబ్బు కూడా తగ్గిపోయింది. ఈ బ్రాండ్లు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాయి. ఇవి వైదొలగాల్సి రావడంతో స్పాన్సర్ షిప్ ఒప్పందాల్లో భారీ తేడా కనిపించింది.
మరి 2026 సీజన్...?
2026లో మార్చి నెలలో ఐపీఎల్ సీజన్-19 మొదలుకానుంది. దీంతో ఈసారి ఆదాయం సహా పలు విషయాల్లో మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, అదంత సులభంగా జరిగేలా లేదు. సౌదీ టి20 లీగ్ వంటి కొత్త లీగ్ లు పుట్టుకురావడమే దీనికి కారణం. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఫ్రాంచైజీలే ఏం చేస్తాయో చూడాలి.