అండ‌ర్-19 ప్ర‌పంచక‌ప్.. గ్రీన్ కార్డుపై ఆధార్ కార్డుదే ఘ‌న విజ‌యం

వ‌ర్షంతో కాస్త ఆల‌స్య‌మైనా... అండ‌ర్ 19 క్రికెట్ ప్రపంచ‌క‌ప్ సజావుగానే మొద‌లైంది. అదికూడా ఇటు భార‌త కుర్రాళ్లు.. అటు పూర్తిగా భార‌త సంత‌తి కుర్రాళ్ల మ‌ధ్య మ్యాచ్ తో కావ‌డం గ‌మనార్హం.;

Update: 2026-01-15 17:40 GMT

వ‌ర్షంతో కాస్త ఆల‌స్య‌మైనా... అండ‌ర్ 19 క్రికెట్ ప్రపంచ‌క‌ప్ సజావుగానే మొద‌లైంది. అదికూడా ఇటు భార‌త కుర్రాళ్లు.. అటు పూర్తిగా భార‌త సంత‌తి కుర్రాళ్ల మ‌ధ్య మ్యాచ్ తో కావ‌డం గ‌మనార్హం. ఈ టోర్రీకి న‌మీబియా, జింబాబ్వే దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆదివారం తొలి మ్యాచ్ లో యువ టీమ్ ఇండియా, అమెరికా జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. జింబాబ్వేలోని బుల‌వాయోలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. ఇటీవ‌లి కాలంలో మంచి ఫామ్ లో ఉన్న మ‌న‌ పేస్ బౌల‌ర్ హెనిల్ ప‌టేల్ ధాటికి అమెరికా జ‌ట్టు వ‌ణికిపోయింది. హెనిల్... 7 ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో అమెరికా జ‌ట్టు 35.2 ఓవ‌ర్ల‌లో 107 ప‌రుగుల‌కే చేతులెత్తేసింది.

తెలంగాణ కుర్రాడే టాప్ స్కోర‌ర్..

ఉత్క‌ర్ష్ శ్రీవాస్త‌వ సార‌థ్యంలోని అమెరికా అండ‌ర్ 19 జ‌ట్టులో మొత్తం భార‌త సంత‌తి కుర్రాళ్లే. ఇందులో ముగ్గురు తెలుగు వారు కూడా ఉండ‌డం విశేషం. అయితే, భార‌త్ తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో టాప్ స్కోర‌ర్ తెలుగువాడే. ఇంకా చెప్పాలంటే తెలంగాణ కుర్రాడు. సుదిని నితీష్ 52 బంతుల్లో 36 ప‌రుగులు చేశాడు. మ‌రో తెలుగు కుర్రాడు ఆరేప‌ల్లి అమోఘ్ (3) విఫ‌ల‌య్యాడు. బౌల‌ర్ అయిన ఇంకో తెలుగోడు అప్పిడి రిత్విక్ (0 నాటౌట్) చివ‌రి బ్యాట్స్ మ‌న్ గా దిగి ఒక్క బంతి కూడా ఎదుర్కొన‌లేదు.

వ‌ర్షం ప్ర‌భావం

అమెరికా విధించిన 107 ప‌రుగుల టార్గెట్ కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అభిజ్ఞాన్ కుందు, కెప్టెన్ ఆయుష్ మాత్రే వంటి హిట్ట‌ర్లున్న టీమ్ ఇండియా చాలా తేలికైన‌దే. అయితే, వ‌ర్షం ప‌డ‌డంతో మ‌న జ‌ట్టు టార్గెట్ ను 37 ఓవ‌ర్ల‌లో 96 ప‌రుగులుగా కుదించారు. 4 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా 17.2 ఓవ‌ర్ల‌లోనే ఛేదించేసింది. అయితే, ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ అయిన ఆయుష్ మాత్రే మ‌ళ్లీ విఫ‌ల‌మ‌య్యాడు. 19 ప‌రుగులే చేశాడు. వైభ‌వ్ (2) రాణించ‌లేదు. కుందు 41 బంతుల్లో 42 ప‌రుగుల‌తో నాటౌట్ నిలిచి జ‌ట్టును గెలిపించాడు.

నిజంగా గ్రీన్ కార్డుదారులే..

అమెరికా అండ‌ర్ 19 జ‌ట్టుపై భార‌త జ‌ట్టు విజ‌యంతో అంద‌రూ గ్రీన్ కార్డుపై ఆధార్ కార్డుదే పైచేయి అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది స‌రైన ప‌దం. ఎందుకంటే... అమెరికా ఆట‌గాళ్ల‌ త‌ల్లిదండ్రులు లేదా తాత‌లు ఉపాధి కోసం ఒక‌ప్పుడు అమెరికా వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డి గ్రీన్ కార్డు ఆ త‌ర్వాత పౌర‌స‌త్వం పొందిన‌వారు. ఈ నేప‌థ్యంలోనే గ్రీన్ కార్డుపై ఆధార్ కార్డుదే పైచేయి అన‌డం స‌రైన‌ది.

Tags:    

Similar News