ఆదివారం భారత్-పాక్ మ్యాచ్...! సుప్రీంలో పిటిషన్.. తలంటిన కోర్టు
ఉగ్రదాడిలో ప్రజలు, ఆపరేషన్ సిందూర్ లో సైనికులు చనిపోయారని, రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని వివరించారు.;
పెహల్గాం ఉగ్రదాడి అనంతరం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత... భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలా చర్చ జరిగింది. నాటి పరిణామాలతో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఎన్నడూ లేనంతగా పతనం అయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్ లకు ఇక అవకాశమే లేదని.. ఐసీసీ టోర్నీల్లోనూ నాకౌట్ దశ నుంచే పాకిస్థాన్ తో ఆడతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. కానీ, నాలుగు నెలల్లోపే నిర్ణయం మారింది. వచ్చే ఆదివారం పాకిస్థాన్ తో టీమ్ ఇండియా తలపడనుంది. కానీ, ఈ మ్యాచ్ ను రద్ద చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అంత అర్జంటేమిటి..??
భారత్-పాక్ మ్యాచ్ రద్దు కోరుతూ వేసిన పిటిషన్ ను అర్జంటుగా విచారించాలని పిటిషనర్లు కోరారు. దీంతో సుప్రీం మండిపడింది. ఇంత అత్యవసరం ఏమిటి? అంటూ నిలదీసింది. అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే.. అలాగే జరగనివ్వండి.. ఆదివారం మ్యాచ్ ఉండగా ఇప్పుడేం చేయాలి? అంటూ సుప్రీం సూటిగా ప్రశ్నించింది. ఈ పిటిషన్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ల ధర్మాసనం ముందుకువచ్చింది. శుక్రవారం (12వ తేదీ) విచారణ జాబితాలో చేర్చకపోతే పిటిషన్ వేసి ఉపయోగం ఉండదంటూ పిటిషనర్ పేర్కొన్నారు.
మ్యాచ్ జరగాల్సిందే...!
ఆదివారం నాటి మ్యాచ్ జరగాల్సిందేనని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ఊర్వశీ జైన్ ప్రస్తావిస్తూ.. మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధం అని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రజలు, ఆపరేషన్ సిందూర్ లో సైనికులు చనిపోయారని, రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన దేశంతో ఆటలతో వేడుక చేసుకోవడం ఏమిటని... ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు కూడా వేదనకు గురవుతాయని పిటిషనర్ తన పిటిషన్ లో తెలిపారు. దేశ గౌరవంతో పాటు ప్రజల భద్రత అనే విషయాలు క్రీడా వినోదం కంటే ముఖ్యమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, వీటిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.
-ఆసియా కప్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా పసికూన యూఏఈని మట్టికరిపించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం పాకిస్థాన్ తో తలపడనుంది. కాగా, భారత్ ఈ మ్యాచ్ ఆడడంపై గతంలోనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఐసీసీ టోర్నీ కానప్పటికీ.. బీసీసీఐ ఎంత చెబితే అంత నడిచే ఈ రోజుల్లో... పెహల్గాం దాడి తర్వాత కూడా పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడడం ఏమిటనేది సందేహంగా మారింది. పైగా ఆసియా కప్ లో లీగ్, సూపర్ సిక్స్, ఫైనల్ మూడు సార్లు పాకిస్థాన్ తో ఆడాల్సి రావొచ్చు. దీంతోనే అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొసమెరుపుః 26 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత భారత్-పాక్ క్రికెట్‌లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. బీజేపీ మాజీ ఎంపీ కూడా అయిన గౌతమ్ గంభీర్ వంటి వీర దేశభక్తుడు హెడ్ కోచ్ గా ఉండగామళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది.