కెప్టెన్, వైస్ కెప్టెనే టీమిండియాకు భారం.. లెక్కలివీ!

నడిపించేవాడిని నాయకుడు అంటారు. అలా నడిపిస్తేనే జట్టు ముందుకు సాగుతుంది. విజయాలు సాధిస్తుంది.;

Update: 2025-12-10 06:22 GMT

నడిపించేవాడిని నాయకుడు అంటారు. అలా నడిపిస్తేనే జట్టు ముందుకు సాగుతుంది. విజయాలు సాధిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ మహేంద్ర సింగ్ ధోని. టీంను ముందుండి నడిపించి విజయాలు సాధించి భారత క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ గా చిరస్థాయిగా ధోని నిలిచిపోయాడు. తర్వాత వచ్చిన రోహిత్ కూడా అంతే.. జట్టు కోసం వేగంగా ఆడి పరుగులు సాధించి సెల్ఫ్ లెస్ క్రికెట్ ఆడాడు. అయితే ఆ ఒరవడి ప్రస్తుతం కొరవడింది. టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ లే జట్టుకు భారంగా తయారవుతున్నారు.

ప్రపంచ క్రికెట్ లో అగ్రగామిగాకొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ అంటే ఆటలో ముందుండి జట్టును నడిపించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్, వైఎస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇద్దరూ బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు.

ఇటీవల సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించినా.. కెప్టెన్ సూర్యకుమార్, బ్యాటింగ్ మరోసారి అభిమానులను నిరాశపరిచింది. ఇది ఒక్క మ్యాచ్ విషయం కాదు.. గత కొంతకాలంగా సూర్య ఫామ్ టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సూర్యకుమార్ యాదవ్ గత 23 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్సులు చూస్తే వరుసగా 20, 1, 39*, 1, 12, 5, 0, 47*, 7*, 2, 0, 14, 12, 0, 1, 4, 21, 75, 8, 29, 8, 26, 58 పరుగులు చేశారు. ఒక్క సెంచరీ కూడా లేదు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఈ లెక్కలను గమనిస్తే ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్ లు తప్ప స్థిరమైన ప్రదర్శన అనిపించేటట్లు కనిపించడం లేదు.కెప్టెన్ స్థాయికి ఇది అస్సలు సరిపోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ది కూడా అదే పరిస్థితి. అతడి గత 15 టీ20 ఇన్నింగ్స్ లు చూస్తే.. 58, 13, 34, 39, 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46 పరుగులు చేశాడు. సూర్యతో పోలిస్తే గిల్ కొంత మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ఒక వైస్ కెప్టెన్ గా ఇంకా ఎక్కువ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జట్టు గెలుపుతో కవర్.. వ్యక్తిగత వైఫల్యాలతో డ్యామేజ్

ప్రస్తుతం టీమిండియా టీ20ల్లో గెలుస్తోంది అంటే దానికి కారణం సమిష్టిగా మిగతా ఆటగాళ్ల ప్రదర్శనే తప్ప కెప్టెన్, వైస్ కెప్టెన్ బ్యాటింగ్ కాదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లు, ఆల్ రౌండర్లు కీలక సమయంలో మ్యాచ్ ను మలుస్తున్నారు.

ఫామ్ లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు

ఒక వేళ సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ లు ఇద్దరూ ఫామ్ లోకి వస్తే మాత్రం భారత జట్టు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే బలమైన టీమ్ గా ఉన్న భారత్.. అప్పుడు ప్రత్యర్థులకు కలలా మారిపోతుంది.

కెప్టెన్, వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనలోనూ ముందుండాల్సిన అవసరం ఉంది. రాబోయే సిరీస్ లలో సూర్య, గిల్ ఫామ్ లోకి రావాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేదంటే ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని క్రికెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Tags:    

Similar News