ఈడీ కోర్టులో హెచ్ సీఏ 'బంతి...' బీసీసీఐ నిధులు పరులపాలు?

హెచ్ సీఏలో నిధుల అక్రమాలపై ఈడీ 2023లోనే కేసు నమోదు చేసింది. అయితే, దీనికి అనుబంధంగా తాజా ఉదంతాలతో మరో కేసు పెట్టింది.;

Update: 2025-07-18 10:15 GMT

వివాదాలు, అవినీతితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వ్యవహారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుతో మరింత ముదురుతోంది. అసోసియేషన్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది. సభ్యులు రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. ఏ పని అయినా టెండర్లు పిలిచి ఇవ్వాల్సి ఉండగా.. అదేమీ లేకుండా నేరుగా తమకు నచ్చినవారికి కేటాయించినట్ల ఈడీ విచారణలో బయటపడింది. దీని ద్వారా హెచ్ సీఏ సభ్యులు భారీగా లబ్ధి పొందినట్లు గుర్తించింది. ఇటీవల హెచ్ సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్, ఆయన భార్యను ఈడీ విచారించింది. రూ.90 లక్షలు క్విడ్ ప్రోకో జరిగినట్లు పసిగట్టింది.

హెచ్ సీఏలో క్రికెట్ బంతుల్లోనే రూ.లక్షలు దుర్వినియోగం అయినట్లు కథనాలు వచ్చాయి. ఈ టెండర్లతో పాటు జిమ్ సామగ్రి, స్టేడియం కుర్చీల టెండర్లలోనూ గోల్ మాల్ జరిగిందని, వీటిని పొందేందుకు రూ.లక్షలు లంచం ఇచ్చారని వెలుగుచూసింది. సురేందర్, ఆయన భార్య పేరిట జేబీ జ్యుయెలర్స్ ఖాతాలోకి లంచం డబ్బులు చేరినట్లు ఈడీ గుర్తించింది. ఇలా బీసీసీఐ నిధులను క్రికెట్ కోసం కాకుండా సొంతానికి వాడుకున్నట్లు, మ్యాచ్ టికెట్ల విక్రయాల్లోనూ గోల్ మాల్ జరిగిందని భావిస్తోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లలో హెచ్ సీఏకు రూ.800 కోట్లకు పైగా నిధులు వచ్చాయనేది ఓ లెక్క. రూ.కోట్ల నిధులున్న సంఘం ఖాతాను సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. టెండర్ల అవినీతిపై గతంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. దీంతో హెచ్ సీఏ సభ్యులను ఈడీ విచారించింది.

హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు... సంఘంలోకి రావడానికి భారీగా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఆయన ఏం చేశారన్నది ఈడీ తేల్చనుంది. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా టెండర్లు (ఫుడ్ క్యాటరింగ్, స్టాల్స్, టికెట్ల కేటాయింపు)లోనూ తమవారికే ప్రయోజనాలు దక్కేలా చేశారనే అభియోగాలున్నాయి.

హెచ్ సీఏలో నిధుల అక్రమాలపై ఈడీ 2023లోనే కేసు నమోదు చేసింది. అయితే, దీనికి అనుబంధంగా తాజా ఉదంతాలతో మరో కేసు పెట్టింది. రెండేళ్ల కిందట తెలంగాణ ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అయితే, నాడు హెచ్ సీఏ మాజీ అధ్యక్షులు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. మాజీ కెప్టెన్, మాజీ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ ను విచారించింది.

దీని అనంతరం దర్యాప్తులో క్రికెట్ వస్తువుల కొనుగోళ్లు, పనుల్లోనూ అక్రమాలు గుర్తిచింది. ఇదంతా జరుగుతుండగానే జగన్మోహన్ రావు అంశం తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News