హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి.. ఈసారి ఏం హింట్ ఇచ్చాడంటే?

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, మైదానం బయట ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే హాట్ టాపిక్‌గా మారుతుంటుంది.

Update: 2026-05-25 10:56 GMT

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, మైదానం బయట ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా ఆయన పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపింది. హార్దిక్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అదీ సూపర్ మోడల్ మహీకా శర్మ తోనేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఏముంది? అనుమానాలకు కారణాలివే!

హార్దిక్ పాండ్యా తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక స్టోరీ ఈ పుకార్లకు ప్రధాన కారణమైంది. ఆ పోస్టులో ఒక డైరీ, ల్యాప్‌టాప్ స్క్రీన్ , ఫోన్ కనిపించాయి. అయితే వాటన్నింటిపై “07:07” అనే సమయం స్పష్టంగా కనిపించడం, అలాగే ఆ స్టోరీకి పింక్ కలర్ థీమ్ ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఈ పోస్టుకు హార్దిక్ సూపర్ మోడల్ మహీకా శర్మను ట్యాగ్ చేస్తూ, హార్ట్ , ఫ్లైట్ ఎమోజీలను జత చేశారు. దీంతో వీరిద్దరూ జులై 7వ తేదీన (07/07) పింక్ సిటీగా పిలవబడే రాజస్థాన్‌లోని జైపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

ఐపీఎల్ లింకులు పెడుతున్న క్రికెట్ ఫ్యాన్స్!

మరోవైపు హార్దిక్ పెట్టిన ఈ మిస్టరీ పోస్టుకు క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో భిన్నమైన అర్థాలు వెతుకుతున్నారు.పోస్టులో పింక్ కలర్ థీమ్ ఉండటంతో హార్దిక్ త్వరలోనే ముంబై ఇండియన్స్ వీడి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మారబోతున్నారా? అని కొందరు అంచనా వేస్తున్నారు. “07:07” అనే నంబర్ ధోనీ జెర్సీ నంబర్ ను సూచిస్తుండటంతో ఆయన త్వరలో సిఎస్‌కే గూటికి చేరబోతున్నారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఊహాగానాలపై హార్దిక్ గానీ, మహీకా శర్మ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కుమారుడు అగస్త్యతో మహీకా క్లోజ్ బాండింగ్!

గత ఏడాది కాలంగా హార్దిక్, మహీకా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల హార్దిక్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆ ఫోటోలలో మహీకా శర్మ, హార్దిక్ కుమారుడైన అగస్త్యతో కలిసి ఎంతో ఆప్యాయంగా గడుపుతూ కనిపించారు. ఇద్దరూ కలిసి చేపలకు ఆహారం వేస్తూ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపించిన ఆ క్షణాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హార్దిక్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న సమయంలో మహీకా అగస్త్యను ఒక తల్లిలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సమయంలో మహీకా తన జీవితంలోకి రావడం తన అదృష్టమని హార్దిక్ తన సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. కీలకమైన మ్యాచ్‌లకు ముందు వీరిద్దరూ కలిసి పలు దేవాలయాలను సందర్శించడం కూడా ఈ బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని, త్వరలోనే పెళ్లి పీటల వరకు వెళ్తుందని స్పష్టం చేస్తోంది.

ఇంతకీ ఎవరీ మహీకా శర్మ?

హార్దిక్ పాండ్యా ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతున్న మహీకా శర్మ కేవలం మోడల్ మాత్రమే కాదు.. విద్యావంతురాలు కూడా. ఆమె ఎకనామిక్స్ మరియు ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్ల ప్రకటనల్లో నటించారు. లీడింగ్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియానిల ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసి టాప్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు మ్యూజిక్ వీడియోలు, ఇండిపెండెంట్ చిత్రాల్లోనూ ఆమె నటించి మెప్పించారు.

నటాషా స్టాన్‌కోవిచ్‌తో విడాకులు.. ఆపై కొత్త జీవితం!

హార్దిక్ పాండ్యా గతంలో సెర్బియన్ మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అగస్త్య అనే కుమారుడు జన్మించాడు. అయితే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, మనస్పర్థల కారణంగా 2024 జులైలో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ పేరు బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో వినిపించినప్పటికీ అది కేవలం పుకారుగానే మిగిలిపోయింది. ప్రస్తుతం మహీకాతో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ "జూలై 7" మ్యాజిక్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో తెలియాలంటే హార్దిక్ పాండ్యా నోరు విప్పే వరకు వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News