చివరి 9 టెస్టులు.. ఒక్కటే గెలుపు.. గంభీర్‌ గ్రాఫ్‌ ఎటుపోతోంది?

అంతేగాక అతడు పెట్టిన కండీషన్లు ఒప్పుకొని కూడా ఇచ్చినదే. కానీ, పరిస్థితులు చూస్తుంటే మాత్రం అతడికి కాలం కలిసి వస్తున్నట్లులేదు.;

Update: 2025-06-26 08:30 GMT

కేవలం 44 ఏళ్లకే టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌..! ఎందరో దిగ్గజాలు చేపట్టిన పదవి.. తన వయసు ధోనీ ఇంకా ఐపీఎల్‌ ఆడుతుంటే.. తనతో ఆడినవారు ఇంకా అంతర్జాతీయ కెరీర్‌ కొనసాగిస్తుంటే.. గంభీర్‌ మాత్రం టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ అయిపోయాడు. ఇది అతడి సామర్థ్యాన్ని చూసి ఇచ్చినదే. అంతేగాక అతడు పెట్టిన కండీషన్లు ఒప్పుకొని కూడా ఇచ్చినదే. కానీ, పరిస్థితులు చూస్తుంటే మాత్రం అతడికి కాలం కలిసి వస్తున్నట్లులేదు.

గంభీర్‌ టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ అయిన వెంటనే గత ఏడాది జూలైలో శ్రీలంక పర్యటన వచ్చింది. రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లిలను రెస్ట్‌ మాన్పించి మరీ తీసుకొచ్చినా అక్కడ వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఇలా జరగడం 1997 తర్వాత తొలిసారి కావడం గమనార్హం. ఆ తర్వాత వెంటనే స్వదేశంలో బంగ్లాదేశ్‌ వంటి బి గ్రేడ్‌ జట్టుపై టెస్టు సిరీస్‌ గెలిచింది. కానీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతోనే గంభీర్‌పై తీవ్ర స్థాయి విమర్శలు వచ్చాయి. సరే.. టైమబాగోలేదని సరిపెట్టుకున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో తొలి టెస్టును నెగ్గినా..తర్వాత మూడు ఓడిపోయి టీమ్‌ ఇండియా తుస్‌మనిపించింది. దీంతోపాటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తు చేజార్చుకుంది. మన స్థానంలో ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా ఏకంగా కప్‌ (గద) కొట్టేసింది. అదికూడా ఆస్ట్రేలియాను ఓడించి కావడం గమనార్హం. ఈ దెబ్బ సీనియర్లు రోహిత్‌, కోహ్లిలను టెస్టు ఫార్మాట్‌ నుంచి తప్పించేలా చేసింది.

పాత సైకిల్‌లో విఫలం అయినా.. కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌లో కొత్త కెప్టెన్‌, కొత్త కూర్పుతో టీమ్‌ ఇండియా శుభారంభం చేస్తుందని అభిమానులు భావిస్తే తాజాగా ఇంగ్లండ్‌ చేతిలో తేలికగా ఓడిపోయింది. అంటే గంభీర్‌ బాధ్యతలు చేపట్టాక మొత్తం 11 టెస్టులు ఆడితే భారత్‌ 3 మాత్రమే గెలిచింది అన్నమాట. ఒకటి డ్రా కాగా.. 7 ఓడింది. ముఖ్యంగా చివరి 9 టెస్టులలో ఒకటే గెలిచింది. టెస్టులు ఆడే ప్రధాన జట్లలో గత 9 మ్యాచ్‌లలో అత్యల్ప విజయాలు నమోదు చేసినది ఇప్పుడు టీమ్‌ ఇండియానే. ఈ నేపథ్యంలోనే మన జట్టు గ్రాఫ్‌ పడిపోతుందా? అనే ఆందోళన అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది. మరి గంభీర్‌ ఏం చేస్తాడో? ఇంగ్లండ్‌ సిరీస్‌ కూడా ఓడితే అతడికి కష్టకాలం మొదలైనట్లే. మరో రెండేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ.. ముందే తప్పుకోవాల్సి రావొచ్చు కూడా.

Tags:    

Similar News