క్రికెట్ కాదు.. అయినా ప్రపంచకప్ టికెట్లకు 50 కోట్ల రిక్వెస్ట్ లు
భారత్-శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 7వ తేదీ నుంచి టి20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికోసం టికెట్ల బుకింగ్ లు ఇంకా మొదలుకావాల్సి ఉంది.;
భారత్-శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 7వ తేదీ నుంచి టి20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికోసం టికెట్ల బుకింగ్ లు ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఒకవేళ ఆ ప్రక్రియ మొదలైతే ఎంతమంది టికెట్ల బుకింగ్ కు ప్రయత్నాలు చేస్తారు..? అరకోటి లేదా కోటిమంది అనుకోవచ్చు. మహా అయితే రెండు కోట్లు..! కానీ, ఒక ప్రపంచ కప్ లో.. ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉండగానే టికెట్ల కోసం ఏకంగా 50 కోట్ల రిక్వెస్టులు రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని కూడా చెప్పొచ్చు. అయితే, ఈ ప్రపంచ కప్ క్రికెట్ కు సంబంధించినది కాదు. మరి.. ఏ క్రీడలో అంటే.. ఇంకేది? విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందిన ఫుట్ బాల్ లోనే. ఇటీవల ఫుట్ బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ హైదరాబాద్ కు వస్తే ఎంతటి సందడి నెలకొందో అందరూ చూశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్ బాల్ ఆడితే చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అంతటి క్రేజ్ కేవలం ఫుట్ బాల్ కే సొంతం. ఇలాంటి క్రీడలో ప్రపంచ కప్ అంటే ఇక చెప్పేది ఏముంటుంది..?
అమెరికా సంయుక్త ఆతిథ్యంలో...
అమెరికాతో పాటు మెక్సికో, కెనడా ఆతిథ్యంలో జూన్ 11 నుంచి ఫుట్ బాల్ ప్రపంచ కప్ మొదలుకానుంది. రికార్డు స్థాయిలో ఈ మెగా టోర్నీలో 48 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే 42 దేశాలు అర్హత సాధించాయి. మరో ఆరు మార్చి నాటికి అర్హత పొందుతాయి. ఈ క్రమంలో టికెట్ల కోసం ఏకంగా 50 కోట్ల రిక్వెస్ట్ లు వచ్చినట్లు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) తెలిపింది. ఈ అభ్యర్థనలు ఏకంగా 211 దేశాల నుంచి వచ్చినట్లు పేర్కొంది. దీంతోనే ఓహ్.. ఒక్క ప్రపంచ కప్ టికెట్లకు ఇంత డిమాండా? అన్న ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
టికెట్లకు లాటరీ...
అసలే ఫుట్ బాల్.. అందులోనూ ప్రపంచకప్.. ఇంకేం.. ఒక్క మ్యాచ్ అయినా చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటారనడంలో సందేహం లేదు. దీంతో టికెట్లను కేటాయించేందుకు లాటరీ తీస్తుంటారు. ఇందులో నమోదు చేయడానికి దరఖాస్తుల సమర్పణకు తుది గడువు గత మంగళవారంతో ముగిసింది. హోస్ట్ కంట్రీస్ అమెరికా, మెక్సికో, కెనడా వారు కాక.. ఫుట్ బాల్ అంటే ప్రాణాలు తీసుకునే మాజీ చాంపియన్లు జర్మనీ, ఇంగ్లండ్, బ్రెజిల్, స్పెయిన్ దేశాల వారు, డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా అభిమానులు అధికశాతం దరఖాస్తులు సమర్పించాలని ఫిపా పేర్కొంది. ప్రపంచ కప్ లో గట్టి జట్లయిన పోర్చుగల్, కొలంబియాల వారూ ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించింది. జూన్ 27న పోర్చుగల్-కొలంబియా, మరుసటి రోజు దక్షిణా కొరియా-మెక్సికో తలపడే మ్యాచ్ ల టికెట్లకు భారీ డిమాండ్ ఉంది.
ఫైనల్ కు పోటెత్తడం ఖాయం
అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జూలై 19న జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లకు సైతం అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఈసారి కూడా లయోనల్ మెస్సీ సారథ్యంలోనే బరిలో దిగనుంది. 2002 తర్వాత ప్రపంచకప్ గెలవని బ్రెజిల్ దాదాపు 25 ఏళ్ల టైటిల్ కల తీర్చుకోవాలని చూస్తోంది. 2014 చాంపియన్ జర్మనీ, 2018 చాంపియన్ ఫ్రాన్స్ ఎలా ఆడతాయో చూడాలి.