ఇంగ్లండ్‌-భారత్‌ టెస్టులో 6 డకౌట్లు..టెస్టుల్లో మొత్తం 10 వేల డకౌట్లు

సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, బ్రియాన్‌ లారా, రికీ పాంటింగ్‌.. ఇలా చెప్పుకొంటే పోతే మొత్తం 15 మంది క్రికెటర్లు 10 వేల పరుగుల అరుదైన మైలురాయిని దాటారు;

Update: 2025-07-05 03:54 GMT

టెస్టు క్రికెట్‌లో పదివేల పరుగులు సాధిస్తే దిగ్గజ బ్యాటర్‌గా గుర్తింపు పొందుతారు. సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, బ్రియాన్‌ లారా, రికీ పాంటింగ్‌.. ఇలా చెప్పుకొంటే పోతే మొత్తం 15 మంది క్రికెటర్లు 10 వేల పరుగుల అరుదైన మైలురాయిని దాటారు. మరి టెస్టుల్లో 10వేల డకౌట్లు కూడా నమోదు అయ్యాయని తెలుసా? అది కూడా ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న టెస్టులోనే అని తెలుసా? 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న బ్రైడన్‌ కార్సెను హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ డకౌట్‌ చేశాడు. ఎల్బీడబ్ల్యూగా అతడిని వికెట్ల ముందు బలిగొన్నాడు. దీంతో టెస్టుల్లో డకౌట్‌ అయిన పదివేలవ బ్యాట్స్‌మన్‌గా కార్సె రికార్డులకెక్కాడు. ఇక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. ఇది ఆ జట్టు చరిత్రలో తొలిసారి కావడం విశేషం. చరిత్రలో తొట్ట తొలి టెస్టు ఆడిన ఇంగ్లండ్‌.. గతంలో ఒక్క ఇన్నింగ్స్‌లో ఇంతమంది బ్యాటర్లు డకౌట్‌గా ఔట్‌ అయినది లేదు. గతంలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కావడమే అత్యధికం.

ఇక ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య 1877లో చరిత్రలో తొలి టెస్టు జరిగింది. ఆ టెస్టులో ఆస్ట్రేలియానే గెలిచింది. నెడ్‌ గ్రెగరీ డకౌట్‌ అయ్యాడు. టెస్టుల్లో తొలి డకౌట్‌ ఈయనదే. పదివేలవ డకౌట్‌ కార్సెది. ఇక 148 ఏళ్లు టెస్టు క్రికెట్‌ చరిత్రలో 2,590 టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య టెస్టు 2,591 కాగా, ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య సెయంట్‌ జార్జ్‌లో జరుగుతున్న 2,592 టెస్టు మరొక్క రెండేళ్ల టెస్టు క్రికెట్‌కు 150 ఏళ్లు పూర్తవుతాయి. అరుదైన రికార్డు అందుకోనుంది.

టెస్టుల్లో అత‍్యధిక సార్లు డకౌట్‌ అయినది వెస్టిండీస్‌ దిగ్గజ పేస్‌ బౌలర్‌ కోర్ట్‌నీ వాల్ష్‌. మొత్తం 43 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వాల్ష్‌ తర్వాత ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (39 డకౌట్‌లు) ఉన్నాడు. టీమ్‌ ఇండియా ప్రధాన పేసర్‌ బుమ్రా ఇప్పటికే 27సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత్‌ తరఫున అత్యధిక టెస్టు డకౌట్‌లు పేసర్‌ ఇషాంత్‌శర్మ (34). తర్వాతి స్థానం మరో మేటి పేసర్‌ జహీర్‌ ఖాన్‌ (29)ది.

సహజంగా ఎక్కువ డకౌట్‌లు టెయిలెండర్లే అవుతారు. వారు ప్రధానంగా బౌలర్లు కాబట్టి. పైన చెప్పుకొన్న అత్యధిక డకౌట్‌ వీరులు అందరూ పేస్‌ బౌలర్లే. ‍బ్రాడ్‌ బ్యాటింగ్‌ చేయగలవాడు. సెంచరీలు కూడా కొట్టాడు. కానీ, అతడూ 39 సార్లు ఖాతా తెరవకపోవడం గమనార్హం.

Tags:    

Similar News