ఏడాదికి 10 వేల కోట్లు.. బీసీసీఐ ఆదాయం అదుర్స్.. 60 శాతం అక్కడినుంచే

తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం బీసీసీఐ 2023-24 సంవత్సర ఆదాయం రూ.9,741.7 కోట్లు. అందులో 60 శాతం రూ.5,761 కోట్లు ఐపీఎల్ ద్వారా వచ్చినవేనట.;

Update: 2025-07-18 18:30 GMT

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). కేవలం కంటిచూపుతో ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బోర్డు ఏదైనా ఉందంటే అది మనదే. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఏం చెబితే అదే శాసనం. అలాంటి స్థితి నుంచి బీసీసీఐ తన మాటే నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. దీనంతటికీ కారణం.. డబ్బు. మరీ ముఖ్యంగా 20 ఏళ్లుగా మన బోర్డు చెప్పిందే వేదం అవుతోంది.

ఉదాహరణకు ఈ ఏడాది పాకిస్థాన్ లో తలపెట్టిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకూడదని నిర్ణయించింది. దీనికిముందే పాకిస్థాన్ మన దేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ నకు వచ్చింది. అలాంటప్పుడు మన జట్టు కూడా పాక్ వెళ్లాలి. కానీ, భద్రతా కారణాల రీత్యా వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. వేరొక జట్టు అయితే టోర్నీ నుంచి వైదొలగేదే..? లేదంటే ఆ జట్టునే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బహిష్కరించేదే.. కానీ, ఇక్కడ ఉన్నది బీసీసీఐ కావడంతో ఐసీసీ నోర్మూసుకుంది. చాంపియన్స్ ట్రోఫీని భారత్ దుబాయ్ లో ఆడింది. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ హవా ఏమేరకు నడుస్తున్నదో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.

తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం బీసీసీఐ 2023-24 సంవత్సర ఆదాయం రూ.9,741.7 కోట్లు. అందులో 60 శాతం రూ.5,761 కోట్లు ఐపీఎల్ ద్వారా వచ్చినవేనట. 2007లో (2008లో తొలి సీజన్) ఐపీఎల్ కు పునాది పడింది. అప్పటినుంచి బీసీసీఐ దశ తిరిగింది. ఇప్పుడు మన బోర్డు నెట్ వర్త్ రూ.30 వేల కోట్లకు పైనే అని సమాచారం. వడ్డీల ద్వారానే రూ.వెయ్యి కోట్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను సైతం శాసిస్తోంది.

ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా భారతీయుడైన జై షా ఉన్నారు. బీసీసీఐ మాజీ కార్యదర్శి కూడా అయిన జై షాకు తోడుగా ఇటీవలే ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మరో భారతీయుడు సంజోగ్ గుప్తా ఎన్నికయ్యారు. 2023-24లోనే బోర్డు ఆదాయం రూ.9 వేలకోట్లుపైగా ఉంది. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. ఈ లెక్కన బీసీసీఐ ఆదాయం రూ.10 వేలకోట్లు దాటి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News