ప్ర‌పంచ క‌ప్ బాయ్ కాట్.. ముల్లు-ఆకు సామెత‌.. బంగ్లాకు భారీ చిల్లు

ఆకు పోయి ముల్లు మీద ప‌డ్డా.. ముల్లు వ‌చ్చి ఆకు మీద ప‌డ్డా.. ఆకుకే చిల్లు...! ఇదీ తెలుగులో బాగా ఫేమ‌స్ అయిన సామెత‌.;

Update: 2026-01-23 11:30 GMT

ఆకు పోయి ముల్లు మీద ప‌డ్డా.. ముల్లు వ‌చ్చి ఆకు మీద ప‌డ్డా.. ఆకుకే చిల్లు...! ఇదీ తెలుగులో బాగా ఫేమ‌స్ అయిన సామెత‌. ఇప్పుడు అచ్చంగా బంగ్లాదేశ్ కు ఈ సామెత స‌రిపోతుంది. అస‌లు భార‌త్ లో భ‌ద్ర‌త‌కు వ‌చ్చిన ఢోకా ఏమీ లేక‌పోయినా, బంగ్లాలోనే అశాంతి నెల‌కొని అక్క‌డి మైనారిటీలైన హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నా.. అదేమీ తెలియ‌న‌ట్లుగా న‌టిస్తోంది బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం. బంగ్లా పేస్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి త‌ప్పించ‌డం వెనుక కార‌ణం.. బంగ్లాలో హిందువుల‌పై దాడుల నేప‌థ్య‌మే. కానీ, బంగ్లా దీనిని క‌డుపులో పెట్టుకుని భార‌త్ లో జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ ను బ‌హిష్క‌రించింది. తెలుగులోనే ఉన్న మ‌రో ముత‌క సామెత‌.. చెరువుపై అలిగి.. అన్న‌ట్లు ఇప్పుడు ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీఎత్తున న‌ష్ట‌పోతోంది. దీనికి ముస్తాఫిజుర్ కోల్పోయిన రూ.9.20 కోట్లు కూడా క‌లుపుకోవాల్సి ఉంటుంది.

ఆడితే లాభం.. అలిగితే న‌ష్టం..

బంగ్లాదేశ్ టి20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా భార‌త్ లోని కోల్ క‌తాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఆ జ‌ట్టు బ‌హిష్క‌రించ‌డంతో స్కాట్లాండ్ కు అవ‌కాశం ద‌క్క‌నుంది. కాగా, బంగ్లాకు టి20 ప్ర‌పంచ క‌ప్ బ‌హిష్క‌ర‌ణ దెబ్బ ఎంతో తెలుసా? ఏకంగా రూ.240 కోట్లు అట‌. బ్రాడ్ కాస్ట‌ర్లు, స్పాన్స‌ర్ షిప్ 60 శాతం మేర‌కు న‌ష్టపోవాల్సిందే. ఈ ప్ర‌భావంతో బంగ్లా క్రికెట్ బోర్డు కార్య‌క్ర‌మాలు బాగా ప్ర‌భావితం అవుతాయ‌ని అంటున్నారు.

స్పాన్స‌ర్లు బైబై

ఏ జ‌ట్టుకైనా అంత‌ర్జాతీయ స్థాయిలో మ్యాచ్ లు జ‌రుగుతూ ఉంటూనే స్పాన్స‌ర్లు వ‌స్తుంటారు. టి20 ప్ర‌పంచ‌క‌ప్ ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. బంగ్లా బాయ్ కాట్ చేసింది కాబ‌ట్టి ఆ నెల రోజులు ఖాళీగా ఉండాల్సిందే. మిగ‌తా దేశాల‌న్నీ కూడా ఇదే స‌మ‌యంలో టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఉంటాయి కాబ‌ట్టి ఏ దేశంతోనూ ఆడే అవ‌కాశం ఉండ‌దు. ప్ర‌పంచ క‌ప్ ను బాయ్ కాట్ చేసినందున బంగ్లాకు స్పాన్స‌ర్లు బైబై చెప్పే చాన్సుంది. అంతేకాదు ఇప్ప‌టికే 2025లో భార‌త జ‌ట్టు బంగ్లా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింది. ఈ ఏడాది ఆగ‌స్టు, సెప్టెంబ‌రులో జ‌ర‌గాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా ర‌ద్దు కానుంది. దీంతో బంగ్లా బోర్డు మ‌రింత కుదేలు కావ‌డం ఖాయం.

బంగ్లా చారిత్రక త‌ప్పిదం

వాస్త‌వానికి బంగ్లా క్రికెట‌ర్ల‌కు భార‌త్ లో ఆడేందుకు ఎలాంటి అభ్యంత‌రాలు లేవు. కేవ‌లం అక్క‌డి తాత్కాలిక ప్ర‌భుత్వ‌మే భార‌త్ పై ద్వేషంతో వ్య‌హ‌రిస్తోంది. ఇప్పుడు బంగ్లా క్రికెట్ లో తిరుగుబాటు జ‌రిగినా ఆశ్చ‌ర్యం లేదు. అంతేకాదు, బంగ్లా చారిత్ర‌క త‌ప్పిదం చేసింద‌ని క్రీడా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇక‌పై ప్ర‌పంచ క్రికెట్ లో ఆ దేశం ఒంట‌రి అవుతుంద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News