స్పాన్సర్‌ లేకుండానే ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా

ఏ ముహూర్తాన ఆసియా కప్‌ (టి20 ఫార్మాట్‌) ఖరారైందో కానీ.. అన్నీ ఇబ్బందికర పరిణామాలే. ఒకటి పోతే ఒకటి అన్నట్లు వరుసగా వెంటాడుతున్నాయి;

Update: 2025-08-23 03:24 GMT

ఏ ముహూర్తాన ఆసియా కప్‌ (టి20 ఫార్మాట్‌) ఖరారైందో కానీ.. అన్నీ ఇబ్బందికర పరిణామాలే. ఒకటి పోతే ఒకటి అన్నట్లు వరుసగా వెంటాడుతున్నాయి. అసలు ఈ టోర్నీ నిర్వహణ భారత్‌లో జరగాలి. ఆతిథ్య హక్కులు మనదగ్గరే ఉన్నాయి. కానీ, పెహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమాయక పర్యటకులను చంపడంతో పరిస్థితులు మారిపోయాయి. అనంతరం భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాక్‌ ఉగ్రమూకలకు గట్టిగా బదులిచ్చింది. ఇక పాకిస్థా్‌న్‌తో ఐసీసీ టోర్నీల్లో అదీ నాకౌట్‌ నుంచి మాత్రమే మ్యాచ్‌లు ఆడతామని చెప్పింది బీసీసీఐ.

తటస్థ వేదికలో లీగ్‌ దశలోనే....

పెహల్గా దాడి ఉదంతం పక్కనపెట్టి... భారత్‌ ఇప్పుడు ఐసీసీ టోర్నీ కానప్పటికీ ఆసియా కప్‌లో లీగ్‌ దశలోనే తలపడుతోంది. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అన్నిటికి మించి ఈ టోర్నీ జరగబోయేది తటస్థ వేదిక దుబాయ్‌లో అన్నది గుర్తుంచుకోవాలి. మరోవైపు ఆసియా కప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ ఇండియాను ప్రకటించగా.. అందులో టెస్టు కెప్టెన్‌ శుభ్‌మనగిల్‌కు చోటిస్తూ వైస్‌ కెప్టెన్సీ కట్టబెట్టారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మంచి రికార్డున్న శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కనపెట్టారు. దీంతో బీసీసీఐపై విమర్శలు మొదలయ్యాయి.

కొత్త సమస్య...

భారత ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును తీసుకొచ్చింది. దీనిప్రకారం క్రికెట్‌కు సంబంధించిన గేమింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11పై నిషేధం వేటు పడనుంది. వాస్తవానికి డ్రీమ్‌ భారత్‌లో చాలా పాపులర్‌. కానీ, కేంద్రం కొత్త చట్టం కొరడా ఝళిపించడంతో బ్యాన్‌ పడింది. అంతేకాదు.. డ్రీమ్‌11 టీమ్‌ ఇండియాకు స్పాన్సర్‌. ఆటగాళ్ల జెర్సీలపై ముందుభాగంలోనే దీని పేరు ఉంటుంది. మరి బ్యాన్‌ నేపథ్యంలో ఏం చేయాలి? అనేది చర్చనీయంగా మారింది. ముందుగానే ఒప్పందం ఉంది కాబట్టి ఆసియా కప్‌లోనూ డ్రీమ్‌ 11 స్పాన్సర్‌ కొనసాతుందా? లేక కేంద్రం నిర్ణయం అమల్లోకి వచ్చినందున ఆటగాళ్ల జెర్సీలపై నుంచి పేరు తొలగిస్తారా? అన్న ప్రశ్నలు వచ్చాయి.

బీసీసీఐ ఏం చెప్పిందంటే..?

కేంద్ర చట్టం నేపథ్యంలో.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించారు. అనుమతి లేని ఎలాంటి స్పాన్సర్‌ను కొనసాగించబోమని తేల్చి చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని పాటిస్తామన్నారు. మరి.. ఈ లెక్కన సెప్టెంబరు 9 నుంచి మొదలయ్యే ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా స్పాన్సర్‌ లోగో లేకుండానే ఆడాల్స ఉంటుంది.

Tags:    

Similar News