వారెవా.. ఏమి పేసు!

Update: 2015-07-13 11:40 GMT
ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఎవరంటే అందరి చూపులు ముందుగా సచిన్‌ టెండూల్కర్‌ మీద పడతాయి. ఆ తర్వాత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను గుర్తు తెచ్చుకుంటారు. చెస్‌ గ్రేట్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరు కూడా చర్చకు వస్తుంది. ఐతే వీళ్లందరికీ ఏమాత్రం తీసిపోని లియాండర్‌ పేస్‌ పేరు మాత్రం కొంచెం ఆలస్యంగా గుర్తుకొస్తుంది. కానీ లియాండర్‌ ఈ విషయంలో ఏమాత్రం బాధపడడు. తాను సాధించిన ఘనతలకు ఎంతో గుర్తింపు రావాల్సి ఉన్నా.. ఆ సంగతి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడమే లియాండర్‌ గొప్పదనం. ప్రస్తుతం ఈ కుర్రాడి వయసు 42 ఏళ్లు మాత్రమే.

ఈ వయసులో టెన్నిస్‌ ఆడటమే గొప్ప అంటే.. లియాండర్‌ వింబుల్డన్‌ లాంటి ప్రతిష్టాత్మక టెన్నిస్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. స్విస్‌ గ్రేట్‌ మార్టినా హింగిస్‌తో కలిసి వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు లియాండర్‌. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గకపోవడం అంటే ఇదేనేమో. పేస్‌ విషయంలో వన్నె తగ్గకపోవడం కాదు.. మరింత పెరుగుతుండటమే విశేషం. వింబుల్డన్‌ ఫైనల్లో పేస్‌ ఉత్సాహం చూస్తే అతడి వయసు 42 ఏళ్లని ఎవరూ అనుకోరు. ఫైనల్లో పేస్‌ హింగిస్‌ జోడీ కేవలం 40 నిమిషాల్లోనే 6-1, 6-1 తేడాతో పెయా, బాబోస్‌ జంటపై విజయం సాధించడం విశేషం. పేస్‌కిది 16వ గ్రాండ్‌స్లామ్‌ విజయం కావడం విశేషం. మరే భారత క్రీడాకారుడూ కల కూడా కనలేని ఘనత ఇది. మహేష్‌ భూపతి 11 గ్రాండ్‌స్లామ్‌లతో ఆగిపోయాడు. ప్రస్తుత క్రీడాకారుల్లో గ్రాండ్‌స్లామ్‌ ఆడితేనే గొప్ప అనే పరిస్థితి ఉంది. ఇక పేస్‌ రికార్డు గురించి ఆలోచించేదెక్కడ? పేస్‌ దాహం ఇంతటితో తీరుతుందా అన్నదే డౌటే. అతడి ఉత్సాహం చూస్తుంటే ఇంకో రెండేళ్లు టెన్నిస్‌లో కొనసాగేలా కనిపిస్తున్నాడు. ఈలోపు ఇంకో రెండు మూడు గ్రాండ్‌స్లామ్‌లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
Tags:    

Similar News