రహ్మాన్ దెబ్బకు సఫారీలు సఫా

Update: 2015-07-21 11:52 GMT
పసికూన అన్న వారికి షాకుల మీద షాకులిస్తున్న బంగ్లాదేశ్ జట్టు తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు అయిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లకు పగలే చుక్కలు చూపించారు. టీమిండియాను చిత్తు చేసిన బంగ్లా జట్టుది వాపు కాదన్న విషయం సఫారీలకు వన్డేలో సినిమా చూపించినప్పుడే అర్థమైంది.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో భాగంగా.. టెస్ట్ క్రికెట్ లోకి కాలు మోపిన బంగ్లా యువ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ తన వాడి.. వేడి బంతుల సత్తా ఏమిటో చాటాడు. అతగాడు సంధించిన బంతుల్ని ఎలా ఆడాలో అర్థం కాక సఫారీ బ్యాట్స్ మెన్లు తికమక పడిపోతున్న దుస్థితి.

నిప్పులు చెరిగే పేస్ తో విరుచుకుపడిన రెహ్మాన్ కారణంగా స్కోర్ బోర్డు ఒక్కసారిగా మారిపోయింది. ముస్తాఫిజార్ రెహ్మాన్ బౌలింగ్ చేయక ముందు మూడు వికెట్లకు 173 పరుగులతో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు..  ముస్తాఫిజుర్ సంధించిన నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి సఫారీలను సఫా చేసినంత పని చేశాడు.

60 ఓవర్లో బంతిని అందుకున్న ఈ యువ బౌలర్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైన్ కకావికలమైపోయింది. ఒక్క పరుగు ఇవ్వకుండానే ఆ ఓవర్ లో మూడు వికెట్లు తీసుకొని.. దక్షిణాఫ్రికా బౌలర్లు వణికిపోయేలా చేశారు. మొదటి రోజులోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టటంతో కేవలం  248 పరుగులకే అలౌట్ కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు ఇంత ఘోరంగా విఫలమయ్యేలా చేయటంలో మస్తాఫిజార్ కీలక భూమిక పోషించాడు. కేవలం 37 పరుగులు ఇచ్చి విలువైన నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా వికెట్ కోల్పోకుండా ఏడు పరుగులు (ఈ వార్త రాసే సమయానికి) చేసింది.
Tags:    

Similar News