రేపటి నుంచి క్రికెట్ లీగ్.. వెంకీ మామ అంబాసిడర్.. అభిమానులూ సిద్ధమా
టీమ్ ఇండియా ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉంది. నెల రోజుల తర్వాత దుబాయ్ లో జరిగే ఆసియా కప్ (టి20 ఫార్మాట్)లో ఆడనుంది.;
మొన్ననే కదా...? ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ముగిసింది.. టీమ్ ఇండియా హోరాహోరీగా పోరాడి 2-2తో సమం చేసింది కదా..? ఇంతలోనే మళ్లీ క్రికెట్ సందడి ఏమిటి..? అనుకుంటున్నారా..? అసలు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్ లే లేవు కదా ప్రస్తుతం.. ఇక లీగ్ క్రికెట్ ఎక్కడిది? అనుకుంటున్నారా?
నెల రోజుల తర్వాతే జాతీయ క్రికెట్...
టీమ్ ఇండియా ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉంది. నెల రోజుల తర్వాత దుబాయ్ లో జరిగే ఆసియా కప్ (టి20 ఫార్మాట్)లో ఆడనుంది. మరి మొన్నటి ఆస్ట్రేలియా టూర్ నుంచి నిన్నటి ఇంగ్లండ్ టూర్ వరకు ఎడతెగని క్రికెట్ ను ఆస్వాదించిన అభిమానులకు మజా ఎలా..? అందుకే నేనున్నానంటూ వస్తోంది ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్). నాలుగో సీజన్ శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఏపీఎల్ చైర్మన్ గా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, రాజ వంశీకుడు సుజయ్ కృష్ణ రంగారావు ఉన్నారు. లీగ్ వివరాలను ఆయన తెలియజేశారు.
ఏడు జట్లు.. హోరాహోరీ సమరాలు..
ఏపీఎల్ లో ఏడు జట్లు తలపడనున్నాయి. శుక్రవారం ప్రారంభోత్సవానికి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కాగా, ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు.. ప్రముఖ హీరో, క్రికెట్ వీరాభిమాని అయిన విక్టరీ వెంకటేశ్.
విజేతకు రూ.35 లక్షలు.. ఐపీఎల్ సెలక్టర్ల రాక
ఏపీఎల్ నాలుగో సీజన్ విజేతకు రూ.35 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలు నగదు బహుమతి దక్కనుంది. అండర్-16 క్రీడాకారులకూ అవకాశం ఇచ్చినట్లు సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. లీగ్ లో ప్రతిభ చాటినవారికి మంచి భవిష్యత్ ఉంటుందని, ఐపీఎల్ సెలక్టర్లు కూడా ఏపీఎల్ మ్యాచ్ లు చూస్తారని వివరించారు. ఈ సీజన్ నుంచి నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్)ను ప్రవేశపెడుతుండడం ఏపీఎల్ ప్రత్యేకత. కాగా, ఏపీఎల్ మ్యాచ్ లకు ఎంట్రీ ఫ్రీ. మ్యాచ్ లను సోనీ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
ఇవీ జట్లు...
ఏపీఎల్ పాల్గొనే జట్ల పేర్లుః సింహాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్ షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్.